హైదరాబాద్‌లో భారీ వర్షం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం మంగళవారం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులన్నీ వాగుల్లా మారాయి. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, పలు బస్తీలు జలమయమయ్యాయి. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. చెట్లు విరిగిపడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. వరద కాలువల్లా మారిన రోడ్లపై ఉన్న ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు 150 ఫీడర్లు ట్రిప్‌ అయ్యాయి. భీకర గాలులకు హుస్సేన్‌సాగర్‌లో భాగమతి బోటు అదుపు తప్పింది. రాత్రి 9 గంటల వరకు రాంచంద్రాపురంలో 7.9 సె.మీ., గచ్చిబౌలిలో 7.7 సె.మీ., గాజులరామారంలో 6 సె.మీ. వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వడగండ్ల వాన కురిసింది. పంటలకు నష్టం వాటిల్లింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించారు. కాగా బుధ, గురువారాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం సాయంత్రం వరకు వేడి, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వాతవారణంలో మార్పులతో కొంత ఉపశమనం పొందారు. వాతావరణం చల్లగా మారిన కొద్దిసేపటికే వర్షం మొదలై ఊపందుకుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తోడయ్యాయి. దీంతో వాతవారణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. కాగా రాంచంద్రాపురం, గచ్చిబౌలిలో భారీ వర్షపాతం నమోదైంది. పంజాగుట్ట, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, చార్మినార్, ఖైరతాబాద్, పటాన్‌చెరు, మల్కాజిగిరి, అల్వాల్, నేరేడ్‌మేట్, ముసాపేట, ఈసీఐఎల్, బాలనగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో గాలి దుమారంతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి ఉప్పల్‌ పరిధిలో, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్‌బస్తీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కీసరలో ఈదురుగాలులతో రహదారుల వెంట ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఎస్‌పీఆర్‌ హిల్స్‌లోని ఒక దేవాలయంలో గల మహావృక్షం నేలకూలడంతో చుట్టు పక్కల ఇళ్ల గోడలు కూలాయి. దీంతో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్‌లలో ప్రధాన రహదారులు వాగుల్ని తలపించాయి. లుంబినీ పార్క్‌ నుంచి సందర్శకులను ఎక్కించుకుని హుస్సేన్‌సాగర్‌లో విహారానికి బయలుదేరిన భాగమతి బోటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు రావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. బోట్స్‌ క్లబ్‌ వైపునకు వెళ్లింది. బోటులోని సిబ్బంది సమాచారంతో స్పీడ్‌ బోట్లలో వచ్చిన ఇతర సిబ్బంది భాగమతి వద్దకు చేరుకుని తాళ్ల సాయంతో దానిని ఒడ్డుకు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భాగమతిలో ఒకేసారి 150 మంది వరకు ప్రయాణించవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)