తీవ్రవుతున్న ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వైరం

Telugu Lo Computer
0


74 ఏళ్ల ఇజ్రాయెల్‌ చరిత్రలో బెంజమిన్‌ నెతన్యాహు ప్రధానిగా అతిమితవాద ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇజ్రాయెల్‌-ఇరాన్‌ వైరం ముదురుతోంది. జనవరి 2న సిరియా రాజధాని డమాస్కస్‌ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ విమానాలు దాడిచేయడంతో అక్కడ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అప్పటి నుంచి ఇంతవరకు సిరియాపై పదిసార్లు ఇజ్రాయెలీ వైమానిక దాడులు జరిగాయి. మార్చి నెల మధ్యలో లెబనాన్‌ నుంచి వచ్చిన చొరబాటుదారుడు ఓ కారును పేల్చివేయడం ఇజ్రాయెలీలను కలవరపరచింది. లెబనాన్‌లో ఇరాన్‌ మద్దతు గల షియా సాయుధ బృందం హెజ్బొల్లా కానీ, ఇరాన్‌ కానీ ఈ సాయుధుడిని పంపిఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల ఇరాన్‌, సౌదీ అరేబియాలు సయోధ్య కుదుర్చుకోవడం ఇజ్రాయెల్‌కు కంటగింపుగా ఉంది. 12 ఏళ్ల నుంచి అంతర్యుద్ధం రగులుతున్న సిరియాలో అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వం అధికారం నిలుపుకొంటుందంటే కారణం రష్యాతోపాటు ఇరాన్‌ అందిస్తున్న తోడ్పాటే. ఇరాన్‌, ఇరాక్‌, లెబనాన్‌ల నుంచి షియా యోధులు సిరియాకు వచ్చి అసద్‌ తరఫున పోరాడుతున్నారు. 1800 మంది ఇరాన్‌ సైనిక సలహాదారులు సిరియా సైనికులతో కలసి పనిచేస్తున్నారు. లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులకు ఇరాన్‌ తదితర దేశాలు 1,30,000 రాకెట్లు, క్షిపణులు సమకూర్చాయి. హెజ్బొల్లాను ఇజ్రాయెల్‌ బద్ధవైరిగా పరిగణిస్తోంది. ఇరాన్‌ అణ్వస్తాల్రు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ ఆ దేశ అణు శాస్త్రజ్ఞులు కొందరిని ఇజ్రాయెల్‌ హతమార్చింది. ఇరాన్‌ అణు కేంద్రాలపైనా దాడులు చేసింది. గత శుక్రవారం సిరియాలో డమాస్కస్‌ శివారుపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో ఇద్దరు ఇరానియన్‌ సైనిక సలహాదారులు మరణించారు. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రతినపూనింది. ఆ తరవాత సిరియా నుంచి తన గగనతలంలోకి ఇరాన్‌ పంపిన డ్రోన్‌ను కూల్చేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. మార్చిలో ఈశాన్య సిరియాలో ఇరాన్‌ డ్రోన్‌ దాడిలో ఒక అమెరికన్‌ సైనిక కాంట్రాక్టర్‌ మరణించగా, ఆరుగురు అమెరికన్లు గాయపడ్డారు. దీనికి ప్రతిగా అమెరికా ఏడుగురు ఇరానియన్లను హతమార్చింది. అయితే, ప్రస్తుతం ఉక్రెయిన్‌ యుద్ధం, చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా కొత్త దండయాత్రకు దిగకపోవచ్చు. యుద్ధం వద్దని ఇజ్రాయెల్‌నూ వారించవచ్చు. కాబట్టి ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య పరోక్ష సమరం యథావిధిగా కొనసాగే అవకాశాలే ఎక్కువ.

Post a Comment

0Comments

Post a Comment (0)