16న ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Telugu Lo Computer
0


మద్యం పాలసీ కేసు లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ ను సోమవారం 11 గంటల సమయంలో దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని సీబీఐ సమన్లు పంపగా, ఈ అంశంపై చర్చించేందుకు సోమవారంనాడే అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి 'ఆప్' సర్కార్ పిలుపునిచ్చింది. మద్యం పాలసీ కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే జైలులో ఉండగా, తప్పుడు కేసులతో సీబీఐ, ఈడీలను ఒక ఆయుధంగా కేంద్రం వాడుకుంటోందని ఆప్ ఆరోపణలు గుప్పిస్తోంది. ''పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చించాల్సి ఉంది. అసలు ఏమి జరుగుతోందనే విషయాన్ని నేతలంతా అసెంబ్లీలో చర్చించనున్నారు'' అని ఆప్ ఎమ్మెల్యే, మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, తప్పుడు సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తున్న సీబీఐ, ఈడీ అధికారులపై కేసులు వేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవలాల్ శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెంటనే స్పందించారు. మద్యం కుంభకోణం కేసులో కోర్టు దోషిగా తీర్పు చెప్తే, కోర్టుపై కూడా కేసు పెడతారా? అని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. చట్టంపై అందరికీ నమ్మకం ఉండాలని అన్నారు. చట్టం తన పని తాను చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, చట్టాన్ని అందరూ గౌరవించాలని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)