రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలి : కిరణ్ రిజిజు

Telugu Lo Computer
0


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో భారత దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు ప్రస్తావిస్తూ దేశంలో, వెలుపల ఉన్న దేశ వ్యతిరేకులు మాట్లాడే మాటలనే రాహుల్ మాట్లాడారని చెప్పారు. ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో మాట్లాడుతూ, భారత దేశంలో వాక్ స్వాతంత్ర్యం లేదని, భారత దేశ ప్రజాస్వామిక మౌలిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆరోపించారు. భారత దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ బీజేపీ, ఆరెస్సెస్ చొచ్చుకెళ్లాయన్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ రిజిజు గురువారం మీడియాతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాల విషయంలో ఎవరూ మౌనంగా ఉండలేరన్నారు. దేశానికి సంబంధించిన ఏ విషయమైనా అందరికీ ఆందోళనకరమైనదేనన్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు? వాటి ప్రభావం ఆయన పార్టీపై ఎలా ఉంటుంది? అనే వాటితో బీజేపీకి, ప్రభుత్వానికి సంబందం లేదన్నారు. ఆయన వల్ల ఆయన పార్టీ మునిగిపోయినా తమకు సంబంధం లేదన్నారు. అయితే దేశాన్ని కించపరచడానికి ఎవరినీ అనుమతించేది లేదని చెప్పారు. ఆయన దేశానికి హాని చేయాలనుకుంటే తాము మౌనంగా ఉండబోమని చెప్పారు. రాహుల్ దేశాన్ని కించపరచలేదని, ఆయన క్షమాపణ చెప్పబోరని కాంగ్రెస్ చెప్తుండటంపై రిజిజు మాట్లాడుతూ, ఇది తీవ్ర విషయం కాదని కాంగ్రెస్ భావిస్తే, పార్లమెంటులో ఓ వర్గానికి ప్రాతినిధ్యంవహించేందుకు ఆ పార్టీ వారు అర్హులు కాదన్నారు. దేశానికి సేవ చేసేందుకు గరిష్ఠ స్థాయిలో అవకాశం ఇచ్చిన భారతీయులకు కాంగ్రెస్‌వారు శాశ్వతంగా రుణపడి ఉండాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా విదేశాల్లో భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై రిజిజు మాట్లాడుతూ, మోదీ విదేశాలకు వెళ్లినపుడు మన దేశాన్ని కించపరచలేదని, కేవలం ఆనాటి ప్రభుత్వం అవినీతిమయం అయిందని, అసమర్థంగా వ్యవహరిస్తోందని మాత్రమే చెప్పారన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)