బొమ్మన్‌, బెల్లీలకు ఘన సత్కారం

Telugu Lo Computer
0


''ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌'' లో నటించిన బొమ్మన్‌, బెల్లీ దంపతులను బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఘనంగా సత్కరించారు. వారికి శాలువా కప్పి జ్ఞాపికలు అందించినట్లు అధికారులు తెలిపారు. నీలగిరి జిల్లాలోని మదుమలైలో ఏనుగులను తమ సొంత బిడ్డల్లా సాకుతూ ప్రశంసలు అందుకొంటున్న ఆ దంపతులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున నగదు చెక్కులను అందజేశారు. అలాగే తమిళనాడులోని మదుమలై, అన్నామలై ఏనుగు శిబిరాల్లో పనిచేస్తున్న 91మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సాయాన్ని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. అలాగే, వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం రూ.9.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కోయంబత్తూరు జిల్లాలోని అన్నామలై టైగర్‌ రిజర్వ్‌లో ఉన్న ఏనుగుల శిబిరాన్ని రూ.5కోట్లతో అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కోయంబత్తూరు జిల్లాలోని సవాడివాయల్‌లో అవసరమైన అన్ని సౌకర్యాలతో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు అటవీశాఖ చేపడుతున్న ఏనుగుల సంరక్షణను ఈ చిత్రం ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లిందని స్టాలిన్‌ అన్నారు. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా రూపొందించిన 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' డాక్యుమెంటరీ ఆస్కార్‌ అవార్డుని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)