పుల్వామా అమరవీరుల భార్యలపై పోలీసుల లాఠీఛార్జ్ !

Telugu Lo Computer
0


రాజస్తాన్ పోలీసులు పుల్వామ అమరవీరుల భార్యలతో దురుసుగా ప్రవర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ధర్నాకు దిగితే లాఠీచార్జ్ చేశారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జైపూర్ లోని షహీద్ స్మారక్ వద్ద బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా ఆధ్వర్యంలో అమరవీరుల భార్యలు, కుటుంబసభ్యులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. శనివారం గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సీఎంను కలిసేందుకు వెళ్లారు. అయితే మధ్యలో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. అమరవీరుల కుటుంబసభ్యులని కూడా చూడకుండా ఇష్టమున్నట్లు కొట్టారు. వారితో పాటు ఇతర మహిళా నేతలను లాక్కెళ్లి వెహికల్స్​లో ఎక్కించారు. ఈ క్రమంలో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'మమ్మల్ని ఎందుకు కొట్టారు? మా డిమాండ్లు చెప్పేందుకు వెళ్తే కొడ్తరా?' అని ఓ అమరవీరుడి భార్య ఆవేదన వ్యక్తంచేశారు. గాయపడిన ఆమె ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతోంది. 'నా భర్త అమరుడైనప్పుడు మంత్రులు సహా చాలామంది వచ్చారు. ఆయన సేవలను కొనియాడారు. అప్పుడే నా బిడ్డలను కూడా ఆర్మీకి పంపాలని నిర్ణయించుకున్నా. కానీ ఈరోజు ఎవరూ మాకు అండగాలేరు. మా కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇక నా బిడ్డలను ఆర్మీకి పంపను' అని మరో అమరవీరుడి భార్య ఆవేదన వ్యక్తంచేసింది. అమరవీరుల భార్యలు రాజ్ భవన్​లో గవర్నర్ కల్​రాజ్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. 'అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు చావు తప్ప.. మరో మార్గం లేదు. చనిపోవడానికి అనుమతించండి'' అంటూ అమరవీరుల భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)