ఎంపీ టిక్కెట్ కోసమే నా తండ్రిని పొట్టన పెట్టుకున్నారు !

Telugu Lo Computer
0


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎంపీ టిక్కెట్ కోసమే తన తండ్రిని పొట్టన పెట్టుకున్నారని వివేకా కుమార్తె సునీత ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డే అసలు సూత్రధారి అని ఆరోపిస్తూ ఆమె హైకోర్టులో ఇంప్లిడ్ పిటీషన్ దాఖలు చేశారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు కీలక నిందితులకు డబ్బులు చేరాయని తెలిపారు. వివేకా హత్యకు ముందు అవినాష్ ఇంట్లోనే సునీల్ యాదవ్ ఉన్నాడని పేర్కొన్నారు. చాలా రోజులుగా వివేకాపై కక్ష పెంచుకున్నారని గుర్తుచేశారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తారనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పిటీషన్ లో పేర్కొన్నారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పే ముందే హత్య గురించి అవినాష్‌కు తెలుసని తెలిపారు. హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని, ఎర్ర గంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాశ్ చెప్పాడని సునీతారెడ్డి పేర్కొన్నారు. 'మా నాన్న చనిపోయారని శివప్రసాద్ రెడ్డి అవినాష్ కు సమాచారం ఇచ్చారు. వివేకా ఇంటికి వచ్చిన శశికళకు గుండెపోటుతో చనిపోయినట్టు అవినాష్ చెప్పాడు. పోలీసులు కూడా గుండెపోటుతో పాటు రక్తపు వాంతులు చేసుకొని చనిపోయినట్టు అబద్దాలు చెప్పారు. హత్య కాదు, సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వివేకాను తానే హత్య చేసినట్టు ఒప్పుకుంటే అవినాష్ రూ.10 కోట్లు ఇవ్వజూపాడని గంగధార్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చినట్టు' సునీత తన నివేదికలో పేర్కొన్నారు. సరిగ్గా సీబీఐ పట్టుబిగిస్తున్న తరుణంలో సునీత ఇంప్లిట్ పిటీషన్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డికి సీబీఐ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దర్ని ఏకకాలంలో విచారణ చేపడుతుండడంతో అరెస్టులుంటాయని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో సునీత హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. హత్యకేసులో సహకరించకుండా ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టులో తప్పుడు కేసులు పెడుతున్నాడని, తనతో పాటు తన భర్త, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నాడని, అటు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తున్నాడని, ఆంధ్రప్రదేశ్ అధికారులు కేసు విచారణలో సహకరించడం లేదని తదితర వివరాలతో సునీత సమగ్రంగా ఇంప్లిట్ పిటీషన్ వేయడం చర్చనీయాంశమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)