వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం !

Telugu Lo Computer
0


దేశమంతటా మార్పు గాలులు వీస్తున్నాయని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్‌ వ్యాఖ్యానించారు. మహారాషట్రలోని పుణె నగరంలోగల కస్బా పెత్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. గత 28 ఏండ్లుగా బీజేపీ అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నది. అయితే, ఇటీవల ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరం పరాజయం మూటగట్టుకుంది. అక్కడ ప్రతిపక్ష మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించాడు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు శరద్‌పవార్‌ను ప్రశ్నించగా, దేశమంతా బీజేపీకి వ్యతిరేకంగా మార్పు గాలులు వీస్తున్నాయనడానికి కంచుకోట లాంటి కస్బా పెత్‌లో ఆ పార్టీ ఓటమే నిదర్శనమని అన్నారు. ఈ ఫలితంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం స్పష్టమైందని చెప్పారు. కాగా, ప్రస్తుతం పుణె పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న గిరీష్‌ బపట్‌, కస్బా పెత్‌ అసెంబ్లీ స్థానంలో 2019 వరకు వరుసగా ఐదు పర్యాయాలు గెలుపొందారు. దేశవ్యాప్తంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పంజాబ్‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ అన్ని రాష్ట్రాలను బీజేపీ నిర్లక్ష్యం చేసిందని పవార్‌ ఆరోపించారు. అంతేగాక వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ ఎలా కూలదోసిందో కూడా ప్రజలు గమనించారని, అవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)