ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం !

Telugu Lo Computer
0


2007లో గుడిపడ్వా (ఉగాది) రోజున మహారాష్ట్రలోని హడాప్సర్‌ పట్టణంలో డాక్టర్ గణేశ్‌ రాఖ్‌ మెడికేర్‌ హాస్పటల్‌ను ప్రారంభించారు. తన ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న వారికి ఆడపిల్ల పుడితే పైసా తీసుకోకూడదని ఆయన 2012లో నిర్ణయించుకున్నారు. నిన్నటి ఉగాదితో ఆ గొప్ప సంకల్పానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 2470 ఉచిత డెలివరీలు చేసిన ఆయన, ఏ రూపంలోనూ పైసా తీసుకోలేదు. ఆస్పత్రిలో ఓపీ మొదలుకొని డెలివరీ వరకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ ఖర్చులేకుండా సమకూర్చారు. ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం అని ప్రకటించగానే మొదట్లో గణేశ్‌ రాఖ్‌ను కొందరు 'మ్యాడ్‌ డాక్టర్‌' అని పిలిచారు. అలా విమర్శించిన నోళ్లే ఇప్పుడు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ వైద్యుడి సేవ మెచ్చి ఇతర వైద్యులు, నర్సులు తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. గణేశ్‌ రాఖ్‌ కీర్తి ఖండాంతరాలకు వ్యాపించడంతో అనేక దేశాల నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. 'సేవ్ గర్ల్‌ చైల్డ్‌' కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరుపై డాక్టర్ గణేశ్‌ రాఖ్‌ త్వరలో అక్కడ ప్రసంగించనున్నారు. గణేశ్‌ రాఖ్‌ ఉచితంగా వైద్యం అందించడం వెనుక ముగ్గురు మహిళల పరోక్ష సహకారం ఉంది. వారే ఆస్పత్రి భవన యజమానులు. ముగ్గురూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాలకు చెందిన వారు. గణేశ్‌ చేస్తున్న మంచి పనికి సహకారం అందించేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. అతి తక్కువ, నామమాత్రపు అద్దె మాత్రమే తీసుకొంటున్నారు. మొదటి భవనం యజమాని పేరు షగుఫ్తా ముస్తఫ్‌ఖాన్‌. ఈమె భర్త ఓ ట్యాంకర్‌ డ్రైవర్‌. రెండో భవనం యజమాని అనురాధ సదాశివ్‌ గోపాలె. ఈమె భర్త ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు. ఈయనే గణేశ్‌కు బాల్యంలో ఇంగ్లిష్‌ బోధించారు. ఎప్పుడైనా అద్దె ఆలస్యం అయితే ఉపాధ్యాయుడిలాగా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తూ గణేశ్‌పై ఒత్తిడి తెస్తారు. ఆ సమయంలో ఆయన భార్య అనురాధ తన వైపు అండగా నిలవడంతో ఆయన వెనక్కి తగ్గుతుంటారని డాక్టర్‌ ఓ సందర్భంలో వివరించారు. మూడో భవనం యజమాని జెన్నిఫర్ ఎరిక్‌ మనేజెస్‌. ఈమె భర్త పారా గ్లైడింగ్‌ పైలట్‌. ఆస్పత్రిని విస్తరించే క్రమంలో ఈ మూడు భవంతులను డాక్టర్‌ అద్దెకు తీసుకున్నారు. ప్రస్తుత అవసరాలు తీర్చడం కోసం ఆ మూడు భవనాలను కలిపి ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)