బెయిల్ కోసం సిసోడియా వినతి !

Telugu Lo Computer
0


ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకోర్టుకు తెలిపారు. తనకు బెయిలివ్వాలని విజ్ఞప్తి చేశారు. రౌస్‌ ఎవెన్యూలో ఉన్న ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన తరఫు న్యాయవాది మంగళవారం ఈ మేరకు వాదనలు వినిపించారు. 'సిసోడియా ప్రజాసేవకుడు. ఆయన విదేశాలకు పారిపోయే ముప్పు లేదు కనుక కస్టడీలో ఉంచనవసరంలేదు. మద్యం విధానంలో మార్పులు చేసేందుకు ఆయన ముడుపులు స్వీకరించినట్లు నిరూపించే ఆధారాలేవీ లభించలేదు. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుమారుడు విదేశాల్లో ఉండటంతో ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత సిసోదియాపైనే ఉన్నందున బెయిలు మంజూరు చేయండి' అంటూ న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ వినతిని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. సిసోదియా అమాయకుడేమీ కాదని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వంలో 18 శాఖల బాధ్యతలను ఆయన నిర్వర్తించారని గుర్తుచేసింది. ఆయన బయటికొస్తే సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రమాదముందని పేర్కొంది. తదుపరి విచారణ మార్చి 24కు వాయిదా పడింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న నగదు అక్రమ చలామణి కేసులోనూ బెయిలు కోసం కోర్టును సిసోడియా ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై ఈ నెల 25లోగా స్పందన తెలపాలని ఈడీని న్యాయస్థానం ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)