'గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌'కు విశాఖ ముస్తాబు

Telugu Lo Computer
0

 


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఈ నెల  3, 4 తేదీల్లో జరగనున్న 'గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌'కు విశాఖపట్నం ముస్తాబవుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయిదు ప్రాంగణాలను సిద్ధం చేశారు. మొదటి ప్రాగంణంలో 700 మంది పారిశ్రామిక అతిథులు భోజనం చేసేలా గదిని సిద్ధం చేస్తున్నారు. రెండో దానిలో స్టార్టప్‌ జోన్‌, ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, చేనేత, పునరుత్పాదకశక్తి (రెన్యువబుల్‌ ఎనర్జీ), ఫార్మా, వైద్యం, వ్యవసాయం, పర్యాటకం, ఆటో, ఏరో స్పేస్‌, ఎంఎస్‌ఎంఈ ఇలా... 14 విభాగాలకు చెందిన 118 స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. మూడో దానిని ప్రధాన సమావేశ మందిరంగా నిర్ణయించారు. ఇందులో 2,076 మంది కూర్చొనే విధంగా సోఫాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఇందులో మీడియాకు 60 సీట్లు కేటాయించారు. సదస్సు ప్రాంగణంలో నాలుగో దానిని ముఖ్యమంత్రికి కేటాయించారు. ఇందులో సీఎంకు ప్రత్యేక గదితో పాటు, సమావేశ మందిరం ఉంటాయి. అలాగే రాష్ట్ర పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు, చీఫ్‌ సెక్రటరీ, ఉన్నతాధికారులకు ప్రత్యేక లాంజ్‌లు, ఐదో ప్రాంగణంలో 390 మంది కూర్చొనేలా సెమినార్‌లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సు నిర్వహణ బాధ్యతను 'టైమ్స్‌ నెట్‌వర్క్‌' అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. పారిశ్రామిక వేత్తలు విశాఖలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వసతి, ఆతిథ్యం ఇలా అన్ని సౌకర్యాలు ఈ సంస్థ చూసుకోనుంది. దీనికి సహకారం అందించడానికి జిల్లా అధికారులతో కూడిన వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. నోడల్‌ అధికారులను నియమించారు. ఈ సదస్సుకు పేర్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు ఒక లింకు పంపుతున్నారు. ఆ లింకు క్లిక్‌ చేస్తే వివరాలు నమోదు చేసుకున్నాక ఒక క్యూఆర్‌ కోడ్‌ వెళుతుంది. ఒక పారిశ్రామిక వేత్త పేరుతో ఒకటే కోడ్‌ ఉంటుంది. ఆ క్యూఆర్‌ కోడ్‌నే సెక్యూరిటీ చెకింగ్‌కు ఉపయోగించనున్నారు. పర్యవేక్షణ బాధ్యతలు చూసే అధికారుల నుంచి మీడియా ప్రతినిధుల వరకు క్యూఆర్‌ కోడ్‌తోనే అనుమతి ఇవ్వనున్నారు. జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీ అధికారులతో... ప్రొటోకాల్‌, రిసెప్షన్‌, రవాణా, రక్షణ, నగర సుందరీకరణ, కల్చరల్‌, మీడియా, పబ్లిసిటీ కమిటీలు ఏర్పాటయ్యాయి. పారిశ్రామిక ప్రముఖులకు 17 హోటళ్లలో 559 గదులు తీసుకోగా అత్యధికంగా నోవోటెల్‌లోనే ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)