'ఆస్కార్' క్రెడిట్‌ మాత్రం తీసుకోవద్దు ప్లీజ్‌..!

Telugu Lo Computer
0


భారత్‌కు రెండు ఆస్కార్‌ అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. 'మేమే దర్శకత్వం చేశాం.. స్టోరీ రాశామంటూ ఈ అవార్డుల క్రెడిట్‌ను భాజపా, ప్రధాని మోడీ మాత్రం తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానం'టూ చమక్కులు విసరడంతో సభలోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. తెలుగు చలనచిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని 'నాటు నాటు' పాటతోపాటు 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' లఘు డాక్యుమెంటరీ.. ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్నాయి. దీనిపై ఖర్గే మాట్లాడుతూ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండూ దక్షిణాదికి చెందిన చిత్రాలు కావడం తమకెంతో గర్వకారణమన్నారు. అయితే, ఈ అవార్డుల క్రెడిట్‌ను అధికార పార్టీ తీసుకోకూడదనేదే తన ఏకైక విజ్ఞప్తి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 'భారతీయ చిత్రాలకు ఆస్కార్‌ అవార్డులు రావడం గర్వకారణం. అయితే, నా విజ్ఞప్తి ఏంటంటే  అధికార పార్టీ ఈ క్రెడిట్ తీసుకోకూడదు. మేమే దర్శకత్వం వహించాం, మేమే రాశాం, ప్రధాని మోడీ  దర్శకత్వం వహించారు  ఇలా అనొద్దు. అదొక్కటే నా అభ్యర్థన. ఇందులో దేశ సహకారం ఉంది' అని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై విపక్ష నేతలే కాకుండా.. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌, అధికార పక్షనేత పీయూష్‌ గోయల్‌, విదేశాంగ మంత్రి డా.ఎస్‌.జైశంకర్‌, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తదితరులు నవ్వుతూ కనిపించారు. అంతకుముందు పీయూష్‌ గోయల్‌ సైతం ఆస్కార్‌ విజేతలను అభినందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర రచయిత పార్లమెంట్‌ సభ్యుల్లో ఒకరంటూ విజయేంద్ర ప్రసాద్‌ పేరును ప్రస్తావించారు. ఆయన సహకారాన్ని గుర్తించాలన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)