ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో గుర్తించాం !

Telugu Lo Computer
0


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా నుంచి తెదేపాకు మద్దతుగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను గుర్తించామని, వారి పేర్లు బయటపెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, వారిపై సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమది రాజకీయపార్టీ అని, పీకేయడానికి వారు ఉద్యోగులు కాదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలకు విప్‌ చెల్లదని, అది ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఆవరణంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. 'మేం నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేను, వెంకటగిరి ఎమ్మెల్యేను పరిగణనలోకి తీసుకోకుండానే తెదేపా, జనసేన నుంచి బయటికి వచ్చిన 5 గురు ఎమ్మెల్యేలతో కలిపి ఈ ఎన్నికల్లో 7 స్థానాలూ గెలిచేంత సంఖ్యా బలం మాకు ఉంది. కానీ గెలవలేదు. చంద్రబాబు మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారు. డబ్బులు తప్ప వారికి ఇవ్వడానికి ఇక ఏముంటుంది ? ఎవరినో కొనుగోలు చేసినట్లున్నారు. లేకపోతే ఏ ప్రాతిపదికన వారికి 23 ఓట్లు వచ్చాయి. నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తెదేపా నుంచి బయటికి వచ్చారు. వారు జగన్‌తో ఉన్నామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అలాంటప్పుడు 19 మందితో 23 ఓట్లు ఎలా తెచ్చుకున్నారు? కచ్చితంగా ప్రలోభపెట్టారు. చంద్రబాబుకు తెలిసిన రాజకీయమే అది. ఎమ్మెల్యేల కొనుగోలులో చంద్రబాబు ప్రపంచ ఛాంపియన్‌ అన్నా మాకేమీ అభ్యంతరం లేదు. జగన్‌, వైకాపా అందులో పోటీ పడలేరు' అని పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)