టీఎస్‌ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌లో 'డైనమిక్‌ ప్రైసింగ్‌'

Telugu Lo Computer
0


ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం అమలు చేసేందుకు టీఎస్ ఆర్టీసీ  సిద్ధమైంది. విమానాలు, ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లు, హోటళ్లలో అమలు చేస్తోన్న ఈ పద్ధతిని దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో తీసుకురానుంది. హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ నుంచి బెంగుళూరు వెళ్లే బస్సుల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ నెల 27 నుంచి అమలు చేయనుంది. ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్‌ ధరల్లో హెచ్చు, తగ్గులు జరగడమే డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం. రద్దీ తక్కువగా ఉంటే సాధారణ ఛార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్‌ ధర ఉంటుంది. ఒకవేళ రద్ధీ ఎక్కువగా ఉంటే  ఎక్కువ రేట్లు ఉంటాయి. డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానంలో 'అడ్వాన్స్‌డ్‌ డేటా అనాలసిస్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌' మార్కెట్‌లోని డిమాండ్‌ను బట్టి ఛార్జీలను నిర్ణయిస్తాయి. ప్రైవేట్‌ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్‌లతో పోల్చి టికెట్‌ ధరను నిర్ణయిస్తాయి. డిమాండ్‌ని బట్టి 125 శాతం నుంచి 75 శాతం వరకు ధరలు మారుతుంటాయి. అంతేకాకుండా ముందు సీట్లు, కిటికీ పక్కన సీట్లకు సైతం అధిక ధరలు ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్‌ పోటీని తట్టుకుని, ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి తెలిపారు. ఈ విధానం వల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణ ఛార్జీ కంటే 20 నుంచి 30 శాతం వరకు టికెట్‌ ధర తక్కువగా ఉంటుందని చెప్పారు. మూడు నెలలు పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానంలో టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం 60 రోజుల వరకు కల్పిస్తున్నామని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.in లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏ కార్యక్రమాన్ని తీసుకువచ్చినా ప్రయాణికులు చక్కగా ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రయాణీకులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)