అమృతపాల్‌ సింగ్ కోసం కొనసాగుతున్న గాలింపు !

Telugu Lo Computer
0


'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ పరారీలోనే ఉన్నాడని, అతని కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పంజాబ్‌తో పాటు పొరుగున ఉన్న హిమాచల్‌లోనూ హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రత పెంచడంతో పాటు, ప్రధాన రహదారుల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అమృతపాల్ సింగ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు మెగా ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అమృతపాల్ అతని అనుచరులతో కలిసి పరారీలో ఉన్నాడు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్, అమృత్ సర్ జిల్లాల్లో ఆయన దాక్కొని ఉంటాడని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం పోలీసుల తనిఖీల్లో జలంధర్‌లో మోటార్ సైనిక్ పై వేగంగా వెళ్తున్న అమృతపాల్ సింగ్ ను గుర్తించారు. అతన్ని పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. పోలీసుల ఆపరేషన్ లో భాగంగా అమృతపాల్ సంస్థ అయిన 'వారిస్ పంజాబ్ దే'కి చెందిన 78 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని విచారణకోసం అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో పాకిస్థాన్ నుండి తప్పుడు సమాచారాన్ని కొందరు వ్యక్తులు పంపిస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మొద్దని పంజాబ్ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు విజ్ఞప్తి చేశాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఫేక్ ఐడీలతో, పాకిస్థాన్ లోని ఖలిస్తానీలు ఇలాంటి పోస్టులను పెడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సోషల్ మీడియాతో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పంజాబ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను పోలీసులు నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన పోలీసులు.. ఆ సమయాన్ని పొడిగించారు. ఆదివారం అర్థరాత్రి 12గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక పంజాబ్‌లోని ప్రభుత్వ బస్సు సర్వీసులు కూడా రెండు రోజులు నిలిచిపోయాయి. సోమ, మంగళవారాల్లోనూ బస్సులు నిలిచిపోనున్నాయి. అమృతపాల్ మద్దతు దారులు విధ్వంసానికి పాల్పడతారని నిఘా వర్గాల సమాచారం మేరకు బస్సులను నిలిపివేసినట్లు తెలిసింది. ఇదిలాఉంటే అమృతపాల్ సింగ్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, విదేశాలలో ఉన్న ఉగ్రవాద గ్రూపులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)