40 మందికి నకిలీ గౌరవ డాక్టరేట్లు !

Telugu Lo Computer
0


'ఇంటర్నేషనల్‌ యాంటీ కరప్షన్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌' సినీ, రాజకీయ, సేవారంగాలకు చెందిన ప్రముఖులకు ఇచ్చిన గౌరవ డాక్టరేట్లు నకిలీవని, వీటికి అన్నా విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని ఆ యూనివర్శిటీ వీసీ డాక్టర్‌ ఆర్‌.వేల్‌రాజ్‌ స్పష్టం చేశారు. ఇటీవల అన్నా యూనివర్శిటీలోని ఆడిటోరియంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో సినీ హాస్య నటుడు వడివేలు, సంగీత దర్శకుడు దేవా, దర్శకుడు కార్తీక్‌ సుబ్బురాజ్‌ సహా దాదాపు 40 మందికి గౌవర డాక్టరేట్లను ఆ సంస్థ ప్రదానం చేసింది. అయితే, ఈ డాక్టరేట్లు నకిలీవని వార్తలు రావడంతో వీసీ వేల్‌రాజ్‌ బుధవారం మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాళ్ళలో నిర్వహించాల్సి ఉందన్నారు. కానీ, మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వల్లినాయగం సిఫార్సు లేఖ రావడంతో యూనివర్శిటీకి చెందిన ఆడిటోరియంలో నిర్వహించేందుకు జనవరి నెలలోనే అనుమతి ఇచ్చామని తెలిపారు. అయితే, ఇక్కడ ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్లు నకిలీవని తేలడంతో గవర్నర్‌ సెక్రటరీకి కూడా సమాచారం అందించామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రత్యేక దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంపై నగర పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వేల్‌రాజ్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)