స్విగ్గీ, జొమాటో ఏజెంట్లకు భారీగా జరిమానాలు

Telugu Lo Computer
0


బైక్‌ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ ఢిల్లీ సర్కారు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు స్విగ్గీ, జొమాటో ఏజెంట్ల పాలిట తలనొప్పిగా మారాయి. వీరి వాహనాలను సైతం బైక్‌ ట్యాక్సీలుగా పేర్కొంటూ ఆర్‌టీఓ అధికారులు వీరికి భారీగా చలాన్లు వేస్తున్నారు. దీంతో ఆయా ఫుడ్‌ డెలివరీ కంపెనీలు ఢిల్లీ సర్కారుకు ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరాయి. ఢిల్లీలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహనాలను కమర్షియల్‌ అవసరాలకు వినియోగించడం మోటారు వాహనాల చట్టం, 1988ను ఉల్లంఘించడమే అవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బైక్‌ ట్యాక్సీలు నడపకుండా ఓలా, ఉబర్, ర్యాపిడోపై నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే భారీగా ఫైన్లు వేస్తామని ప్రకటించింది. రవాణా శాఖ ఉత్తర్వులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వారిపై చలాన్లు విధిస్తున్నారు. అయితే, తమ వాహనాలకు సైతం ఆర్‌టీఓ అధికారులు చలాన్లు వేస్తున్నారంటూ స్విగ్గీ, జొమాటో సంస్థలు దిల్లీ సర్కారుకు ఫిర్యాదు చేశాయి. బైక్‌ ట్యాక్సీగా భావించి తమ ఏజెంట్‌ ఒకరికి రూ.15వేలు ఫైన్‌ వేశారని స్విగ్గీ పేర్కొంది. ఇటీవలి ఇచ్చిన ఉత్తర్వులు గందరగోళానికి దారితీశాయని, దీంతో ఫుడ్‌/ క్విక్‌ కామర్స్‌ డెలివరీ ఏజెంట్లకు ఆటంకంగా మారిందని తెలిపింది. డెలివరీ చేసేందుకు తమ ఏజెంట్లు వెనకాడుతున్నారని స్విగ్గీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తప్పుగా అర్థం చేసుకున్నారని, దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని జొమాటో ప్రతినిధి ఒకరు ప్రభుత్వాన్ని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)