నేను గొడ్డు మాంసం తింటా !

Telugu Lo Computer
0


మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27 న జరుగనున్నాయి. ఎన్నికలకు వారం రోజుల ముందుగా మేఘాలయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గొడ్డు మాంసం తినే అలవాటుతోపాటు బీఫ్‌పై నిషేధం విధించడం, సీఏఏ, పొత్తుల వంటి అంశాలపై ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎర్నెస్ట్‌ మౌరీ వ్యాఖ్యలు మరో వారంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని పరిశీలకులు ఆసక్తిగా ఉన్నారు. తాను గొడ్డు మాంసం తింటానని మేఘాలయ రాష్ట్ర బీజేపీ శాఖాధ్యక్షుడు ఎర్నెస్ట్‌ మౌరీ స్పష్టం చేశారు. గొడ్డు మాంసం తినడంతో పార్టీకి ఎలాంటి ఇబ్బంది అని ఎదురు ప్రశ్నించారు. తన వరకైతే గొడ్డు మాంసం తినడం ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గొడ్డు మాంసం తినడంపై నిషేధం లేదని చెప్పారు. బీజేపీలో ఉన్న తనకు ఎలాంటి సమస్యా రాలేదన్నారు. రాష్ట్రంలోని 90 శాతం మంది క్రైస్తవులు బీజేపీ రాడికల్ స్టాండ్‌ను ఫాలో అవుతారా అని ప్రశ్నించగా.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాల్లో ఇంతవరకు ఏ చర్చిపై దాడి జరిగింది చూడలేదన్నారు. రెండు రోజుల క్రితం మేఘాలయలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పార్టీ సీనియర్‌ నాయకుడు అమిత్‌షా.. ఎన్‌పీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అయితే, ఎన్‌పీపీతో పొత్తు లేదని, ఎవరికి వారుగానే పోటీచేస్తున్నామని ఎర్నెస్ట్‌ మౌరీ చెప్పడం విశేషం. బీజేపీ మొత్తం 60 సీట్లలో అభ్యర్థులను రంగంలోకి దింపిందని తెలిపారు. ఫలితాలను బట్టి ఎవరితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలన్నది ఆలోచిస్తామని పేర్కొన్నారు. గత ఐదేండ్లలో ఎన్‌పీపీ నేతల అవినీతి పరాకాష్టకు చేరిందని కూడా వ్యాఖ్యానించారు. టీఎంసీ అధికారంలోకి వస్తే మాత్రం బంగ్లాదేశ్‌ చొరబాటుదారులు పెరిగిపోతారని కూడా చెప్పారు. సీఏఏపై ఇప్పటికైతే ఎలాంటి ఆలోచన లేదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)