దేశంలో ఏడాదికి 15వేల అవయవ మార్పిడిలు !

Telugu Lo Computer
0


అవయవ దానంపై ప్రజల్లో పెరుగుతోన్న అవగాహనతో ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నామని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో అవయవ మార్పిడి  శస్త్రచికిత్సలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య ఏడాదికి 15వేలకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో అవయవ మార్పిడిల సంఖ్య ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది. 'కొవిడ్‌ తర్వాత అవయవ మార్పిడి కేసుల్లో ఎంతో వేగం పెరిగింది. గతేడాది 15వేల మార్పిడిలు జరిగాయి. ఈ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. ఇంతకుముందుతో పోలిస్తే అవయవ మార్పిడి కేసుల సంఖ్యలో 27శాతం పెరుగుదల కనిపించింది' అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన నోటో సైంటిఫిక్‌ డైలాగ్‌-2023  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వీటికోసం కేంద్ర, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలోనూ ప్రత్యేక విభాగాలు ఉన్నాయని చెప్పారు. భారత్‌లో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి నాణ్యమైన జీవన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో కీలకమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ, అవగాహన వ్యూహాలు ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. వీటిపై ప్రజల్లో ఎంతో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 640 మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులు ఉన్నప్పటికీ.. అవయవ మార్పిడి సర్జరీ చేసే సదుపాయం కొన్నింటిలోనే ఉందని, వీటిని మరింత పెంచాలన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)