ఐఎంఎఫ్‌ షరతులకు తలొగ్గిన పాకిస్తాన్ !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని అందుకోవడానికి చెప్పిన షరతులన్నింటికీ  పాకిస్తాన్ తలూపుతోంది. ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరిచేందుకు ప్రజలపై పన్నుల భారం మోపేందుకు తాజాగా నిర్ణయించింది. ప్రజలపై భారం మోపి రూ.17వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించేందుకు సిద్ధమైంది. ఉద్దీపన ప్యాకేజీ కోసం పాకిస్తాన్, ఐఎంఎఫ్‌ అధికారుల మధ్య 10 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా 1.1 బిలియన్‌ డాలర్ల రుణాన్ని విడుదల చేసేందుకు ఈ చర్చలు జరిగాయి. అయితే, ఎలాంటి ఒప్పందమూ కుదరకుండానే ఐఎంఎఫ్‌ అధికారులు శుక్రవారం వాషింగ్టన్‌ పయనమయ్యారు. దీనిపై పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ మాట్లాడుతూ రుణం కోసం ఐఎంఎఫ్‌ కొన్ని షరుతులు విధించిందని చెప్పారు. సోమవారం నుంచి వర్చువల్‌ విధానంలో చర్చలు కొనసాగనున్నాయని తెలిపారు. అయితే, అందుకు కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. కొద్ది గంటల తర్వాత కేబినెట్‌కు చెందిన ఎకనమిక్‌ కోఆర్డినేషన్‌ కమిటీతో ఆయన సమావేశం అయ్యారు. ఈ భేటీలో కొన్ని పన్నులు విధించేందుకు ఆమోదం తెలిపారు. విద్యుత్‌పై ఒక్కో యూనిట్‌కు రూ.3.21 వరకు త్రైమాసిక సర్దుబాటుతో పాటు స్పెషల్‌ ఫైనాన్సింగ్‌ సర్‌ఛార్జి కింద రూ.3.39 చొప్పున ఏడాది పాటు వసూలు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద ఒక్కో యూనిట్‌కు రూ.4 చొప్పను మూడు నెలల పాటు రికవరీ చేయాలనీ నిర్ణయించారు. ఐఎంఎఫ్‌ షరతుల మేరకు మార్చి 1 నుంచి జీరో రేటింగ్‌ కలిగిన పరిశ్రమలకు రాయితీలు, కిసాన్‌ ప్యాకేజీని సైతం ఎత్తివేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. జనరల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ను సైతం 1 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. పాక్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యుత్‌ ఛార్జీలతో పాటు, నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో అక్కడి ప్రజల జీవనం మరింత భారం కానుంది. ఓ వైపు అప్పుల్లో కూరుకుపోయినా డిఫెన్స్‌కు మాత్రం సాయాన్ని కొనసాగించడం గమనార్హం. టెక్నికల్‌ సప్లిమెంటరీ గ్రాంట్‌ కింద రూ.450 మిలియన్లను ఇదే భేటీలో కేబినెట్‌ ప్రకటించింది. ప్రస్తుతం పాక్‌ విదేశీ మారకం నిల్వలు 3 బిలియన్‌ డాలర్లకు దిగువకు చేరాయి. దేశంలో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవడంతో చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడి పెట్రోల్‌ బంకులు ఖాళీ అవుతున్నాయి. లీటర్‌ డీజిల్‌ ధర రూ.262కు చేరింది. పెట్రోల్‌ సైతం రూ.200 దాటింది. పెట్రోల్‌ పంపుల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)