గ్రామ కంఠాలు పంచాయతీ భూములు కావు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 February 2023

గ్రామ కంఠాలు పంచాయతీ భూములు కావు !


గ్రామ కంఠం భూములు గ్రామ పంచాయతీకి చెందిన భూములు కావని హైకోర్టు తేల్చి చెప్పింది. గ్రామ కంఠం భూమి తమదంటూ ఆ భూమిలో కొందరు వ్యక్తులు నిర్మించిన షాపులను అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. కూల్చిన షాపులను కూల్చిన చోటే యథాతథంగా తొమ్మిది నెలల్లో నిర్మించి ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది. ఒకవేళ నిర్మాణంలో జాప్యం చేసినా, నిర్మాణాలు చేపట్టకపోయినా పిటిషనర్లే నిర్మాణాలు పూర్తి చేసుకుని, అందుకైన ఖర్చును గ్రామ పంచాయతీ నుంచి రాబట్టుకోవచ్చునని స్పష్టం చేసింది. కశింకోట గ్రామం సర్వే నంబర్‌ 110/1లోని గ్రామ కంఠం భూమిలో పి.వెంకటలక్ష్మి, డి.శ్రీదేవి, వి.పాపారావులు దుకాణాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. గ్రామ కంఠం భూమి తమ భూమి అని, ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నామని, అందువల్ల షాపులను ఖాళీ చేసి వెళ్లాలంటూ కళింపేట గ్రామ పంచాయతీ అధికారులు వెంకటలక్ష్మి తదితరులకు 2020లో నోటీసులిచ్చారు. ఆపై 2022లో మరోసారి నోటీసులిచ్చారు. మూడు రోజుల్లో షాపులను ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వెంకటలక్ష్మి తదితరులు సమాధానమిచ్చారు. అయితే తామిచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా తమ షాపులను కూల్చేసేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారంటూ వెంకటలక్ష్మి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే పంచాయతీ అధికారులు పిటిషనర్ల షాపులను కూల్చివేశారు. ఆ స్థలాన్ని ఓ సామాజిక భవన నిర్మాణం కోసం అప్పగించేందుకు సిద్ధమయ్యారు. వెంకటలక్ష్మి తదితరుల తరఫు న్యాయవాది వీవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. నోటీసుకు తాము సమాధానం ఇచ్చామని, దాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా తమ షాపులను కూల్చివేశారని కోర్టుకు నివేదించారు. గ్రామ పంచాయతీ తరఫు న్యాయవాది ఎన్‌.శ్రీహరి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందన్‌రావు పైవిధంగా తీర్పునిచ్చారు.

No comments:

Post a Comment