పిల్లల్లో క్యాన్సర్ ను సకాలంలో గుర్తించాలి !

Telugu Lo Computer
0


ప్రపంచం మొత్తం మీద పిల్లలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో 20 శాతం భారత్ లోనే ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఏటా 75,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీం కింద ఆర్థికంగా నిధుల కేటాయింపుతో పిల్లల క్యాన్సర్ చికిత్స సేవలో గత కొన్నేళ్లుగా భారత్ చెప్పుకోదగిన అభివృద్ధి సాధిస్తున్నా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోల్చుకుంటే ఫలితాలు మాత్రం అంత సంతృప్తికరంగా ఉండటం లేదు. ఇదంతా వ్యాధిని గుర్తించడం, చికిత్స అందడం , నయం కావడం వీటన్నిటిలో విపరీత జాప్యం జరగడమే కారణంగా వైద్యులు చెబుతున్నారు. 70 శాతం మందికి నయం అవుతున్నా, 30 శాతం మందిలో వారి జీవిత కాలంలోమళ్లీ ఏదోనాటికి వ్యాధి తిరిగితోడడానికి దారి తీస్తోంది. బాల్యంలో 20 గ్రేల కంటే ఎక్కువగా రేడియేషన్‌కు గురైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. శరీరం నుంచి గ్రహించిన రేడియేషన్‌ను గ్రే అంటారు. మామోగ్రామ్ వంటి పరీక్షలు చిన్నవయసులో చేయించడం అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. లుకేమియా (రక్త సంబంధ క్యాన్సర్లు), మెదడులో వచ్చే కణతులు ( బ్రెయిన్ ట్యూమర్లు) , లింపోమా, సాఫ్ట్ టిష్యూ సార్కోమా వంటివి పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్లను గుర్తించడంలో వైద్యుల్లో తగినంత అవగాహన లేకుంటే చాలా కష్టమవుతుంది. గుర్తించడం ఆలస్యమైతే చాలా కేసులు నయం కాకుండా పోతాయి. మరోసమస్య ప్రధాన నగరాల్లోనే ఈ చికిత్సలు అందుబాటులో ఉంటున్నాయి తప్ప మిగతా ప్రాంతాల్లో ఉండడం లేదు. పిల్లలు పాలిపోయినట్టు ఉండడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం, అలసట, ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం , మచ్చలు ఏర్పడటం, తీవ్రమైన రక్తస్రావం, ఒళ్లు నొప్పులు వంటివి కనిపిస్తే లుకేమియా అని అనుమానించాల్సి వస్తుంది. రక్త పరీక్షల ద్వారా, తుంటి లేదా ఇతర పెద్ద ఎముకల నుంచి తీసిన మూలుగ ను పరీక్షించడం ద్వారా ఈ క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు. పొద్దున్నే లేచేటప్పుడు తలనొప్పి తీవ్రంగా ఉన్నా, వికారం, వాంతులు ఎక్కువైనా, ఆందోళన , ఫిట్స్, చూపు మందగించడం, వంటి లక్షణాలను మెదడు కణితిగా అనుమానించాల్సి వస్తుంది. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యు సంబంధ కారణాలు క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. ఈ లక్షణాలను గుర్తించి సరైన చికిత్స అందించడం తప్పనిసరి. పోషకాహార లోపాలు లేకుండా చూసుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)