ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌ ఎన్నిక

Telugu Lo Computer
0


ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. భాజపా అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్‌ కాగా షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొత్త మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబేరాయ్‌కు ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అభినందనలు తెలిపారు. '' ప్రజలు గెలిచారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించిన కార్యకర్తలు, ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆప్‌ తొలి మేయర్‌ షెల్లీ ఒబేరాయ్‌కు హృదయపూర్వ అభినందనలు'' అని ట్వీట్‌ చేశారు. షెల్లీ ఒబెరాయ్‌ ఢిల్లీ యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గానూ పనిచేస్తున్నారు. ఆమె వయస్సు 39 ఏళ్లు. ఇండియన్‌ కామర్స్‌ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యురాలు. హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె  ఇగ్నో నుంచి స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో పటేల్‌ నగర్‌ (తూర్పు) వార్డు నుంచి బరిలో దిగి తొలిసారి కౌన్సిలర్‌గా గెలుపొందారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)