ఎర్లీ వార్నింగ్ సిస్టం అమలు చేయనున్న యోగీ ప్రభుత్వం

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని యోగీ ప్రభుత్వం పిల్లలను తిరిగి స్కూళ్లకు తీసుకొచ్చేందుకు నెదర్లాండ్ ఫార్ములాను ఉపయోగిస్తోంది. నెదర్లాండ్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టం ప్రకారం ముందుగా ఎవరైతే స్కూలు నుంచి మధ్యలో చదువు మానేసి వెళ్లిపోయారో వారిని గుర్తించడం జరుగుతుంది.ఆ తర్వాత వారిని మానిటర్ చేయడం జరుగుతుంది. వెంటనే ఆ విద్యార్థులను తిరిగి స్కూలుకు వచ్చేలా ప్రోత్సహించడం జరుగుతుంది. ఏటా ఇలాంటి సర్వేను యోగీ సర్కార్ చేపడుతోంది. 2020-21 విద్యాసంవత్సరంలో 4.81 లక్షల మంది విద్యార్థులు బడి మానేసినట్లు తమ సర్వేలో వెల్లడైంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 4 లక్షలుండగా 2022-23లో 3.30 లక్షల మంది డ్రాపౌట్స్‌ను గుర్తించింది. ముందుగా ప్రభుత్వం డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులను గుర్తించి వారు ఎందుకు స్కూలు మానేశారో కారణం తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించి స్కూలుకు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. నెదర్లాండ్స్ విద్యా విధానం ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో 12 మందితో కూడిన బృందం ఆ దేశానికి మార్చి నెలలో వెళ్లనుంది. అక్కడ నెదర్లాండ్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టంను స్టడీ చేసి ఉత్తర ప్రదేశ్‌లో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. డ్రాప్ అవుట్స్‌ను గుర్తించి వారిని తిరిగి స్కూళుకు వెళ్లేలా చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని విద్యాశాఖ డీజీ విజయ్ కిరణ్ ఆనంద్ వెల్లడించారు.అంతేకాదు డ్రాప్ అవుట్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారులు స్వయంగా మాట్లాడి వారి పిల్లలను స్కూళ్లకు పంపేలా ఒప్పించే ప్రయత్నం చేస్తారని చెప్పారు. నెదర్లాండ్స్‌లో అమలవుతున్న ఎర్లీ వార్నింగ్ సిస్టం ప్రకారం స్కూలుకు కొంత కాలంగా రాకుండా లేదా స్కూల్లో చాలా తక్కువ సమయం గడిపే విద్యార్థులను గుర్తిస్తారు. ఉదాహరణకు ఒక విద్యార్థి 40 రోజుల పాటు స్కూలుకు రాకుంటే వెంటనే ట్రాకింగ్ చేస్తారు. ఆ తర్వాత విద్యార్థి తల్లిదండ్రులను అధికారులు కలిసి ఏ కారణం చేత విద్యార్థి స్కూలుకు రావడం లేదో కనుక్కుంటారు. ఆ తర్వాత అధికారుల బృందం ఒకటి ఏర్పాటై ఇలా స్కూళ్లకు రాని విద్యార్థులను తిరిగి పాఠశాలకు చేరేలా చర్యలు తీసుకుంటారు. ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు ముందుగా నెదర్లాండ్స్‌కు 12 మందితో కూడిన బృందం వెళ్లనుంది. వీరంతా ఉత్తర్ ప్రదేశ్‌లో అవార్డులు దక్కించుకున్న ఉపాధ్యాయులు కావడం విశేషం. ఇది అమలు అయితే డ్రాప్‌ అవుట్స్‌ను గుర్తించి తిరిగి స్కూళ్లలో చేర్పించే రాష్ట్ర ప్రభుత్వాల్లో దేశంలో తొలి రాష్ట్రంగా యోగీ సర్కారు గుర్తింపు పొందుతుంది. ఇలా చేయడం వల్ల ప్రతి చిన్నారి చదువు అంటే ఆసక్తి చూపి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)