ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పలేకపోయారు !

Telugu Lo Computer
0


పార్లమెంటులో విపక్ష పార్టీలు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రసంగించిన మోదీ, విపక్షాలపై విమర్శలు చేయడం మినహా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. అదానీ గ్రూప్ ఫ్రాడ్ కేసు సహా దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటిని మోదీ తన ప్రసంగంలో అసలు ప్రస్తావించనే లేదని ఖర్గే మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా బుధవారం లోక్‭సభను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇక గురువారం రాజ్యసభలో ప్రసంగిస్తూ గాంధీ కుటుంబ సభ్యులు నెహ్రూ పేరును ఎందుకు తమ పేరు చివర్లో పెట్టుకోలేదని, అంత అవమానకరంగా వాళ్లు ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ''ప్రభుత్వ పథకాలకు కొంత మంది వ్యక్తుల పేర్లు, సంస్కృత పదాలతో సమస్యలు ఉన్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబం పేర మీద 600 ప్రభుత్వ పథకాలు ఉన్నాయని నేను ఒక రిపోర్టులో చదివాను. చాలా పథకాలకు నెహ్రూ పేరు పెట్టారు. మరి వారి కుటుంబానికే చెందిన నెహ్రూని ఇంటిపేరుగా ఎందుకు పెట్టుకోలేదో నాకు అర్థం కావడం లేదు. భయమా లేదంటే అవమానకంగా భావిస్తున్నారా?'' అని మోదీ ప్రశ్నించారు. ఇక దేశ సమస్యలపై కాంగ్రెస్ వైఖరి సరిగా లేదని మోదీ విమర్శలు గుప్పించారు. దేశానికి కాంగ్రెస్ శాశ్వత పరిష్కారాలు చూపలేదని, వారికి ఆ ఆలోచనే లేదని అన్నారు. ''దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. 2014లో నేను మినట్ డీటెయిల్స్ చూశాను. 60 ఏళ్లలో కాంగ్రెస్ రోడ్డు మీద గుంతలు మాత్రమే నిర్మించింది. అంతకు మించి ఏమీ చేయలేదు. మేము సాంకేతికతను ఆధారం చేసుకుని పనిని బదిలీ చేస్తున్నాము. పని పెరగడమే కాకుండా పనితనంలో కూడా వేగాన్ని పెంచాము'' అని మోదీ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)