ఇళ్లలోనే ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Telugu Lo Computer
0


దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది వణికి పోతున్నది. వాయవ్య, మధ్య, తూర్పు భారతంలో దట్టమైన పొగ మంచు తెరలు అలముకోవటంతో రోడ్డు, రైల్వే, విమాన మార్గాల ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నది. ఢిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ప్రాంతంలో ఆదివారం 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి వాతావరణం వ్యవసాయం, పశువులు, నీటి సరఫరా, రవాణా, విద్యుత్తు రంగాలపై కొన్నిచోట్ల ప్రభావం చూపిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. చలి వల్ల గడ్డ కట్టే పరిస్థితులు ఉండటంతో, ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచించింది. ఢిల్లీ సహా కొన్ని నిర్దిష్టమైన ఉత్తరాది ప్రాంతాలకు ఐఎండీ 'ఆరెంజ్‌’ అలర్ట్‌ను జారీ చేసింది. 'రాజస్థాన్‌, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అతి శీతల గాలులు వీచాయి' అని వెల్లడించింది. పొగమంచు కారణంగా ఆదివారం 88 రైళ్లు రద్దయ్యాయని, 335 రైళ్లు ఆలస్యంగా నడిచాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 31 రైళ్లను దారి మళ్లించామని, 33 రైళ్లను గమ్య స్థానాల కంటే కొద్దిగా ముందుగానే ఆపేశామని వివరించారు. 20 విమానాలు ఆలస్యంగా నడిచాయని ఢిల్లీ విమానాశ్రయం అధికారి ఒకరు వెల్లడించారు.  తీవ్రమైన చలి వల్ల ఉత్తరప్రదేశ్ లోని జజ్జర్‌లో విషాదం చోటుచేసుకొన్నది. శనివారం రాత్రి హీటర్‌ ఆన్‌ చేసి ఉంచి ఆసిఫ్‌, అతడి భార్య, ఇద్దరు పిల్లలు నిద్రపోయారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ తలుపు తీయకపోవటంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఆసిఫ్‌ కుటుంబ సభ్యులు విగత జీవులుగా పడి ఉండటం చూసి దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే వారు ఊపిరాడక మరణించారని వైద్యులు తెలిపారు. మరోవైపు చలి కారణంగా లక్నోలోని నవాబ్‌ వాజిద్‌ అలీ షా జూలోని జంతువులకు హీటర్లు, దుప్పట్లు, ఎండు గడ్డి ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)