స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి

Telugu Lo Computer
0


స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగేలా చూడాలని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ఎన్నికల కమిషన్‌ ని కోరారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, గత ఉప ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేకపోవడంతో ఇసికి ఓ దృష్టాంతంగా నిలిచిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు రాష్ట్రానికి ఇసి బెంచ్‌ రావడానికి రెండు రోజుల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం స్థానిక వివేకానంద గ్రౌండ్స్‌లో ట్రేడ్‌ యూనియన్‌ సిఐటియుకి మద్దతుగా సిపిఎం నిర్వహించిన కార్యక్రమంలో మాణిక్‌ సర్కార్‌ మాట్లాడారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోయారని అన్నారు. బిజెపి కార్యకర్తల బెదిరింపులను ఇసి దృష్టికి తీసుకువెళ్లేందుకు సిపిఎం యత్నించిందని, కానీ పోలింగ్‌ స్టేషన్‌ వెలుపల ఏం జరిగినా తాము బాధ్యులం కాదని, వాటిని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లాలని ఇసి అధికారులు తోసిపుచ్చారని అన్నారు. నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోకుండా, ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కుని ఎలాంటి భయం, బెదిరింపులు లేకుండా వినియోగించుకునేలా ఇసి రాజ్యాంగ బాధ్యతను తాము గుర్తు చేయాలనుకుంటున్నామని అన్నారు. అందుకు తగిన పరిస్థితులు కల్పించేలా చూడాలని ఇసిని కోరారు. త్రిపురలో బిజెపి మిత్రపక్షం ఐపిఎఫ్‌టి రాజకీయంగా బలహీనంగా మారడంతో... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో బిజెపితో కలిసి ఉన్న వామపక్ష వ్యతిరేక నేతలు తిరిగి కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కేంద్రం బలగాలను మోహరించడం బిజెపి ఎత్తుగడ కావచ్చని మండిపడ్డారు. ప్రసుత పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ విషయాన్ని కేంద్రం గమనించాలన్నారు. వంద కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయని, మరో మూడు వందల కంపెనీల బలగాలు రానున్నాయని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)