ఉత్తర భారత్ లో తీవ్రమైన చలిగాలులు !

Telugu Lo Computer
0


ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాలు చలి గుప్పెట్లో చిక్కుకున్నాయి. కశ్మీర్‌లో అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల -6 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయాయి. దాల్ సరస్సులో కొంత భాగం గడ్డకట్టింది. దీంతో అక్కడ పర్యాటకుల కోసం బోట్లు నడిపేవారు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి పైప్‌లైన్లు కూడా గడ్డకట్టాయి. రోడ్డు రవాణాకు అంతరాయాలు ఏర్పడి సరకుల సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో స్థానికులకు రోజువారీ అవసరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో చలి, శీతల గాలులు తీవ్రంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2.2 డిగ్రీలకు పడిపోయాయి. ఫుట్ పాత్ లపై నివసించే నిరాశ్రయులంతా చలిగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. రోజుకు సుమారు 23 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లే రైల్వే వ్యవస్థకు మంచు కారణంగా ఇబ్బందులు కలిగాయి. కొన్ని రైళ్లు 10 గంటల పాటు ఆలస్యం అవుతుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. చలిగాలుల కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలూ ఎదుర్కొంటున్నారు. శీతాకాలంలో కాలుష్యం స్థాయి అధికంగా ఉండే ఢిల్లీలో చలిగాలులు కూడా తీవ్రం కావడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. రాజస్థాన్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీని కారణంగా వ్యవసాయ పనులకు ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు చెప్తున్నారు. అమృత్‌సర్‌ను గత కొద్దిరోజులుగా దట్టమైన మంచు కమ్మేస్తోంది. బస్‌లు, రైళ్లు సహా రవాణా వ్యవస్థకు ఆటంకమేర్పడుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)