కొవిడ్‌కు ఒకే డోసు టీకా !

Telugu Lo Computer
0


మూడు డోసుల కొవిడ్ టీకాకు బదులు ఒకే డోసు టీకాను ఆవిష్కరించేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. నాగపూర్ లో మూడు రోజుల పాటు జరిగే  భారత ఫార్మాస్యూటికల్ 72 వ సదస్సుకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్ నిరోధానికి ప్రస్తుతం ప్రాథమిక డోసులు 2, అదనపు డోసు టీకా ఒకటి వేస్తుండగా, ఈ స్థానంలో ఒకే డోసు టీకా కోసం పరిశోధనలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. మన దేశంలో ఔషధ పరిశోధకులను విశేషంగా ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఇవ్వాలని డాక్టర్ ఎల్ల ఈ సందర్భంగా కోరారు.' భారతీయ కంపెనీలకు పరిశోధనల ఆధారిత రాయితీలు ఇవ్వడం ఎంతో అవసరం. మనదేశంలో ఆవిష్కరించి పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఉత్పత్తికి పన్ను రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా' అని ఆయన పేర్కొన్నారు. తద్వారా పరిశోధనలపై శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు దృష్టి సారిస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల) పథకం మాదిరిగా, పరిశోధనల ఆధారిత ప్రోత్సాహ పథకాన్ని తీసుకు వచ్చే ఆలోచన చేస్తోందని భారత ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్ వి.జి. సోమానీ తెలిపారు. భారత ఫార్మాస్యూటికల్ సదస్సు ఇక్కడ మూడు రోజుల పాటు జరగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)