అమర్త్యసేన్‌ను అవమానించకండి !

Telugu Lo Computer
0


నోబెల్‌ గ్రహీత అయిన అమర్త్యసేన్‌ను అవమానించవద్దని బీజేపీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరిం చారు. ఆయన సమస్యలను తీర్చకుండా కొత్త సమస్యలు సృష్టించి ఆయన ఇబ్బందులు పడేలా చేయొద్దని సూచించారు. ఇదే సమయంలో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని కాషాయీకరణ చేయడం మానుకోవాలని హితవు పలికారు. భూ వివాదంలో అమర్త్యసేన్‌కు అండగా మమత బెనర్జీ నిలిచారు. సోమవారం ఆమె శాంతి నికేతన్‌లోని అమర్త్యసేన్ ఇల్లును సందర్శించారు. అక్కడ అమర్త్యతో చాలా సేపు మాట్లాడారు. అనంతరం అమర్త్యసేన్ నివాసానికి సంబంధించిన భూ పత్రాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ 'అమర్త్యసేన్‌ను అవమానించేలా బీజేపీ ప్రయత్నిస్తున్నది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ప్రతిదీ జరగదని, ప్రజా కోర్టు కూడా ఉన్నదన్నది గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ చర్యలను నిరసిస్తూ అమర్త్యసేన్‌ మాట్లాడిన తర్వాత ఆయనపై బీజేపీ కారాలు మిరియాలు నూరుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. నోబెల్‌ గ్రహీతను సన్మానించడానికి బదులుగా ఆయనను బీజేపీ నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నదని విచారం వ్యక్తం చేశారు. కేవలం 13 డెసిబుల్‌ భూమి కోసం పోరాటం జరుగుతున్నదని చెప్పారు. విశ్వ భారతి విశ్వవిద్యాలయం తప్పుడు వాదనలు చేస్తున్నదని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే అమర్త్యసేన్‌ను అవమానిస్తున్నారని, దాంతో ఆయనకు అండగా నిలిచి సమస్యను పరిష్కరించేందుకు ఆయన ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అమర్త్య సేన్ 13 డెసిబెల్ విశ్వవిద్యాలయం భూమిని ఆక్రమించారని విశ్వ భారతి విశ్వవిద్యాలయం ఆరోపించింది. ఆ భూమిని తిరిగి ఇవ్వాలని అమర్త్యసేన్‌కు ఈ నెల 27 న పంపిన లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో అసలు భూమి రికార్డులను మమతా బెనర్జీ తవ్వితీశారు. ఈ పత్రాలను స్వయంగా అందజేసేందుకు అమర్త్యసేన్‌ ఇంటికి ఆమె వచ్చారు. మరోవైపు, క్యాంపస్‌లో తనకున్న భూమిలో ఎక్కువ భాగం తన తండ్రి మార్కెట్ నుంచి కొనుగోలు చేశారని, మరికొన్ని ప్లాట్లను లీజుకు తీసుకున్నారని అమర్త్యసేన్‌ పేర్కొంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)