ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌నాథ్‌ ఆలయం వద్ద ఉన్న పోలీసులపై దాడి చేసిన నిందితుడు ముర్తజా అబ్బాసీకి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉండటంతో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 121 ప్రకారం కోర్టు ఈ శిక్ష విధించినట్లు ఏడీజీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రషన్ కుమార్ తెలిపారు. అలాగే పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు సెక్షన్ 307 కింద నిందితుడికి జీవిత ఖైదు కూడా కోర్టు విధించిందని చెప్పారు. గొరఖ్‌పూర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీ 2015లో ఐఐటీ ముంబైలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత రెండు ప్రముఖ కంపెనీల్లో పని చేశాడు. గత ఏడాది ఏప్రిల్‌ 13న స్థానిక గొరఖ్‌నాథ్‌ ఆలయం వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసులపై కత్తితో దాడి చేశాడు. అనంతరం పారిపోతున్న అతడ్ని ఛేజ్‌ చేసి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ముర్తజా అబ్బాసీకి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)తో సంబంధాలున్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఐఎస్ఐఎస్ కోసం పోరాడతానని అతడు ప్రమాణం చేశాడని, ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడని అభియోగాలు మోపారు. ఈ కేసుపై విచారణ జరిపిన లక్నోలోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఏడాదిలోపే నిందితుడికి మరణ శిక్ష విధించింది. ఈ మేరకు సోమవారం తీర్పు ఇచ్చింది.


Post a Comment

0Comments

Post a Comment (0)