కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధుల్ని చేర్చుకోండి !

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టులో న్యాయమూర్తం నియామకాల విషయంపై కొంతకాలం నుంచి అత్యున్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధుల్ని చేర్చుకోవాల్సిందిగా కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌కు  లేఖ రాశారు. జడ్జీల నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరమని.. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపింది. ఆ సమయంలో.. ప్రస్తుతం దేశంలో న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్లుగా ఇటీవల కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. న్యాయస్థానాల్లో కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక అప్పటినుంచి కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదే సమయంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. 2014లో తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ని కొట్టేయడం ద్వారా ప్రజలెన్నుకున్న పార్లమెంటు సార్వభౌమత్వాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని విమర్శించారు. ఆ విమర్శతో ఈ వివాదం మరింత ముదిరింది. అందుకు సుప్రీంకోర్టు కూడా గట్టిగానే బదులిచ్చింది. కొలీజియం నచ్చకపోతే ఇంకో వ్యవస్థను తీసుకురావాలని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకపోయినా.. సిఫార్సులను అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే.. దాన్ని ఎవ్వరూ నిరోధించరని పేర్కొంది. అయితే.. ఆలోపు అమల్లో ఉన్న చట్టాన్ని కచ్ఛితంగా అమలు చేయాల్సిందేనని ఉద్ఘాటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)