బ్రెజిల్‌లో పేట్రేగిన బోల్సోనారో మద్దతుదారులు !

Telugu Lo Computer
0


బ్రెజిల్‌ రాజధాని రణరంగంగా మారింది. మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో మద్దతుదారులు వందల సంఖ్యలో నగరంలో బీభత్సం సృష్టించారు. పార్లమెంట్‌పై, సుప్రీం కోర్టుపై మెరుపు దాడికి దిగారు. అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని, అధ్యక్షుడు లూలా గద్దె నుంచి దిగిపోవాలంటూ అలజడి సృష్టించారు. యూఎస్‌ కాపిటల్‌ చొరబాటు ఘటన తరహా పరిణామం చోటు చేసుకుంది. రెండేళ్ల కిందట ట్రంప్‌ మద్దతుదారులు ఎలాగైతే రచ్చ రచ్చ చేశారో దాదాపు అదేరీతిలో తాజాగా బోల్సోనారో మద్ధతుదారులు బ్రెసిలియాలో బీభత్సం సృష్టించారు. ఆకుపచ్చ, పసుపు రంగు దుస్తుల్లో జెండాలు చేతబట్టి తలుపులు బద్ధలు కొట్టి మరీ పార్లమెంట్‌లోకి చొరబడ్డారు. అక్కడ చట్ట సభ్యుల కార్యాలయాలను నాశనం చేశారు. స్పీకర్‌ పొడియం దగ్గర విధ్వంసం సృష్టించారు. ఆపై సుప్రీం కోర్టు హెడ్‌క్వార్టర్స్‌లోనూ అదే రీతిలో వ్యవహరించారు. అక్కడితో ఆగకుండా అధ్యక్ష భవనం మీదకు ఎక్కి నినాదాలు చేశారు. ఒక పోలీస్‌ని గుర్రం మీద నుంచి లాగి కిందపడేసి దాడికి దిగారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి పరిస్థితిని సమర్థవంతంగా అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఐదుగురు జర్నలిస్ట్‌లు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా దా సిల్వా అధికార భవనంలో లేరు. వరద ప్రభావిత ప్రాంతమైన అరారక్వారాలో పర్యటిస్తున్నారు. ఈ ఘటనను ఫాసిస్ట్‌ దాడిగా ఆయన వర్ణించారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ జరగని వాటికి ఈ ఫాసిస్ట్‌ ఉన్మాదులు కారణం అవుతున్నారని మండిపడ్డారాయన. అయితే ఈ దాడితో తమకేం సంబంధం లేదని బోల్సోనారో ప్రకటించుకున్నారు. లూలా ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. అలాగే.. నిరసనకారులెవరైనా సరే శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ఆయన కాలిఫోర్నియా ఉన్నట్లు సమాచారం.


Post a Comment

0Comments

Post a Comment (0)