ఆరోపణలపై కమిటీ ఏర్పాటు : రెజ్లర్లు అసంతృప్తి

Telugu Lo Computer
0


రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపుల గురించి నిజాలు తేల్చేందుకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. తమను సంప్రదించకుండానే కమిటీ ఏర్పాటు చేయడంపై రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌తోపాటు, కోచ్‌లు తమను లైంగికంగా వేధించారని ఇటీవల భారత రెజ్లర్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినేశ్ ఫోగట్, భజ్‌రంగ్ పూనియా, సాక్షి మాలిక్‌తోపాటు మరికొందరు రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలపై కేంద్రం తాజాగా స్పందించింది. ఈ అంశంపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. హామీ ఇచ్చినట్లుగానే కేంద్రం బాక్సర్ మేరీ కోమ్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. అయితే, కమిటీ ఏర్పాటు చేసే ముందు తమను ప్రభుత్వం సంప్రదించలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా హామీ ఇచ్చి కూడా తమకు చెప్పకుండానే కమిటీని ఏర్పాటు చేశారని భజ్‌రంగ్ పూనియాతోపాటు పలువురు రెజ్లర్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్ర క్రీడా శాఖ స్పందించింది. తాము ఏర్పాటు చేసిన కమిటీలోని ఐదుగురిలో ముగ్గురు రెజ్లర్లు సూచించిన వాళ్లే ఉన్నారని క్రీడా శాఖ తెలిపింది. మేరీ కోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ తృప్తి ముర్గుండే, రాజగోపాలన్, రాధికా సిమ్రాన్ ఉన్నారు. వీరు రెజ్లర్ల ఆరోపణలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)