తమిళనాడు గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Telugu Lo Computer
0


తమిళనాడు పేరును 'తమిళగం' అని మార్చాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు తమిళనాడును కుదిపివేస్తున్నాయి. అలాగే ద్రవిడ రాజకీయాలపై చేసిన ఆయన వ్యాఖ్యలపై సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)తో పాటు అన్ని రాజకీయ పక్షాలు గవర్నర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక తమిళులైతే సోషల్ మీడియా వేదికగా విమర్శల నిప్పులు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని డీఎంకే ఆరోపించింది. తమిళనాడులో 50 ఏళ్ల ద్రవిడ పాలనపై గవర్నర్‌ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, రాజ్‌భవన్‌లో కాకుండా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యాలయంనుంచి వచ్చిన వ్యాఖ్యలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికేనని డిఎంకె సీనియర్ నేత, లోక్‌సభ ఎంపి టిఆర్‌ బాలు అన్నారు. ''దురదృష్టవశాత్తు తమిళనాడులో తిరోగమన రాజకీయాలు ఉన్నాయి, మనం ద్రావిడులం, దీనితో (భారత్) మాకు సంబంధం లేదు. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న కొన్ని అబద్ధాలు, కల్పితాలను చెరిపేయాలి. తమిళనాడు దేశానికి ఆత్మ, ప్రత్యేక ఆలోచన, గుర్తింపు. ఇక్కడ తిరోగమన రాజకీయాలు ఎక్కువయ్యాయి. దేశంలో రాష్ట్రం అంతర్భాగం కాదని చెబుతూ, తమ ప్రయోజనాల కోసం విద్యావేత్తలతో సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజంన చేకూర్చే ప్రతిదాన్ని గుడ్డిగా తిరస్కరించే అలవాటు పెరిగింది" అని రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వాల పథకాలపై వ్యతిరేకతను గవర్నర్ పరోక్షంగా ప్రస్తావించారు. అయితే దీనిపై డీఎంకే, ఏఐడీఎంకే సహా మిగిలిన రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక నెట్టింట్లో అయితే కొందరు మరో అడుగు ముందుకు వేసి, అవును తమిళనాడు ప్రత్యేక అస్తిత్వం ఉన్న దేశమే అంటూ వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ట్విట్టర్‭లో #TamilNadu అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగులో ఉంది. ద్రావిడ పార్టీల సభ్యులు, మద్దతుదారులు ఈ హ్యాష్‭ట్యాగ్ ఉపయోగిస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)