ఆర్థిక సంక్షోభ దిశగా పాకిస్తాన్ ?

Telugu Lo Computer
0


ప్రపంచం ఆర్థికంగా సంక్షోభలో కూరుకుపోతోంది. అమెరికా, యూరప్ లాంటి అగ్రదేశాలు సైతం దీంతో ఇప్పటికే జాగ్రత్త పడ్డాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం చూశాము.  ప్రస్తుతం పాకిస్తాన్ నగదు కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారుతోంది. రానున్న రోజుల్లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశం ఉందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ హెచ్చరించింది. ఈ హెచ్చరికల్లో భాగంగా అక్కడి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని సెంట్రల్ బ్యాంక్ విమర్శించింది. ప్రస్తుతం ఈ వార్త అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం భారీగా పెరిగిన ధరల నియంత్రణపై దృష్టి సారించకుండా, వృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ చర్యలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కలిగిన పర్యవసానాలను ఇప్పుడు దేశం ఎదుర్కొంటోందని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. పెరుగుతున్న ధరలు, ఆర్థిక స్థిరత్వాన్ని పణంగా పెట్టి వృద్ధికి ప్రాధాన్యతనిచ్చే దేశాలు వృద్ధిని నిలబెట్టుకో లేకపోతున్నాయని అంతర్జాతీయ అనుభవం పదే పదే చూపిందని పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవలి నివేదికను ఉటంకించింది. వృద్ధిపై ఫోకస్ చేస్తూ స్థిరత్వాన్ని పట్టించుకోని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుతం దాయాది దేశం తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నందున 2023 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిపై దృష్టి పెట్టడం మానేసింది. అయినప్పటికీ ఆర్థిక, ధరల స్థిరత్వాన్ని తీసుకురావడంలో విఫలమైంది. అందుకే FY23లో పాకిస్థాన్ ఆర్థికం అంచనాల కంటే తక్కువగా అంటే 3-4 శాతం కన్నా తక్కువ వృద్ధి రేటు ఉంటుందని ఎస్‌బీపీ అంచనాలను డాన్ వార్తా పత్రికలో ఒక నివేదిక ప్రచురితమైంది. వృద్ధిలో తీవ్ర క్షీణత ఇప్పటికే వ్యాపార, పారిశ్రామిక రంగాలలో భారీ తొలగింపులకు దారితీసింది. త్వరలో మరో పెద్ద రౌండ్ తొలగింపులు ప్రారంభమవుతాయని పాకిస్థానీలు ఆందోళన చెందుతున్నారు. టెక్స్‌టైల్ మిల్లులు, ఎగుమతిదారులు, దిగుమతిదారులు క్రెడిట్ లెటర్స్ ఓపెన్ చేయకపోవటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బిజినెస్ సైకిల్ స్తంభించిపోయింది. ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటిని తగ్గించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటంతో అక్కడ ద్రవ్యోల్బణం 25 శాతానికి చేరుకుంది. ఇది కేవలం గత 5 నెలలుగా దిగజారుతున్న అక్కడి ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇది ఆర్థిక స్థిరత్వం, వృద్ధి అవకాశాలను దిగజార్చుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 8 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్ 16 నాటికి 6.1 బిలియన్ డాలర్లకు దిగజారాయి. ఇది ఒక నెల దిగుమతుల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయని తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ సైతం శ్రీలంక బాటలో పతనానికి చేరువగా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)