భారత్ జోడో యాత్ర సక్సెస్ !

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజస్తాన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర 100 రోజులు విజయవంతం అయిందని రాహుల్ ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని గుర్తుచేస్తూ ఎన్నికల్లో ఫలితాలివ్వని యాత్ర సక్సెస్ అని ఎలా చెబుతారని మీరెలా చెప్పుకుంటారని రాహుల్ ను ఓ మీడియా విలేఖరి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా బీజేపీ, ఆరెస్సెస్ తాము ఎంచుకున్న పద్ధతులనే ఈ దేశం అమలు చేయాలని కోరుకుంటున్నాయి. ఓ భాష, ఓ సిద్ధాంతం, ఓ మతం పైచేయి సాధించాలని అవి కోరుకుంటున్నాయని, దాంతోనే దేశంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ తెలిపారు. ఈ విషయం జనంలోకి తీసుకెళ్లడంలో భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందని రాహుల్ తెలిపారు. తన యాత్ర ద్వారా జనంలోకి వెళ్తుంటే ఎందుకు వస్తున్నారు, మీరెవరని ప్రశ్నించడం లేదని దీన్ని బట్టి జనంలో ఉన్న సోదరభావం అర్ధమవుతోందన్నారు. ఇదే తన విజయం అన్నారు. మరోవైపు ఈ ప్రెస్ మీట్లో మీడియా తనను చైనా చొరబాట్లు, కేంద్రం వైఖరిపై ఒక్క ప్రశ్న కూడా అడగదని ఓ కాంగ్రెస్ నేతతో తాను బెట్ కట్టానని రాహుల్ వెల్లడించారు. ఊహించినట్లే మీడియా చైనా మినహా అన్ని విషయాలు తనను అడుగుతోందన్నారు. దీంతో అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ చైనా చొరబాట్లపై ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రాహుల్ కేంద్రం ఉద్దేశపూర్వకంగా చైనాతో పొంచి ఉన్న ముప్పును దాచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కానీ అది సాధ్యం కాదన్నారు. చైనా అన్నివైపుల నుంచి భారత్ ను చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తోందని, కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ మాట వినేందుకు సిద్దంగా లేదన్నారు. యువత సాయంతో భారత్ ను దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. కానీ కేంద్రానికి ఇవేవీ పట్టడం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వ్యూహాత్మకంగా పనిచేయడం లేదని, కేవలం ఈవెంట్ల తరహాలోనే పనిచేస్తోందని రాహుల్ విమర్శించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఈవెంట్ల తరహాలో పనిచేస్తామంటే కుదరదని, విదేశాంగమంత్రి దీనిపై ఆలోచించాలని కోరుతున్నానని రాహుల్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)