తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసమ్మతి జ్వాల !

Telugu Lo Computer
0


తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన వ్యతిరేక బ్యాచ్ కత్తులు దూసింది. కమిటీల కూర్పుపై, అంతర్గత అన్యాయంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతూ, రేవంత్‌తో పార్టీకి ఒరిగిందేమీ లేదని మండిపడింది. రెబల్ బ్యాచ్ శనివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో భేటీ అయి, మంతనాలు జరిపింది. తర్వాత నేతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. కమిటీల కూర్పులో పార్టీనే నమ్ముకుని ఉన్నవారికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమను కోవర్టులు ముద్రవేసి అవమానిస్తున్నారని వాపోయారు. వేరే పార్టీల నుంచి వచ్చినవారికే పెద్ద పీటలు వేస్తూ శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, ఇలాగైతే దుకాణాన్ని బంద్ చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించకుండా కమిటీలు వేయడం తన మనసుకు బాధ కలిగించింది భట్టి అన్నారు. నాలుగైదు పార్టీలు మారి వచ్చిన వారితో పార్టీ బాగుపడదని ఉత్తమ్, రాజనర్సింహలు.. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తాజాగా వేసిన కమిటీల్లో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్లో యాభై మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లేనని మండిపడ్డారు. కాగా, ఢిల్లీలో ప్రధాని మోదీని కలసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భట్టి ఫోన్ చేసి మద్దతు పలకడం ఇందులో కొసమెరుపు. అసంతృప్త నేతలకు వెంకట్ రెడ్డి కూడా మద్దతు ప్రకటిస్తూ, వారు ఏ నిర్ణయం తీసుకున్నా పాటిస్తానన్నారు. రెబళ్ల భేటీ టీ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డిని ఒంటరిని చేసి పెత్తనం దక్కించుకోవడం, లేకపోతే వేరు కుంపటి పెట్టుకోవడం వంటి ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)