శివసేనకు ద్రోహం చేశారు !

Telugu Lo Computer
0


శివసేన పార్టీని వీడి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేత ఆదిత్యా ఠాక్రే తప్పుపట్టారు. వారిని పార్టీ ద్రోహులుగా అభివర్ణించారు. తమదే అసలైన శివసేన అంటూ స్ధానిక ఎన్నికలకు ముందు సరికొత్త పేర్లతో ప్రజల ముందుకొచ్చిన ఇరు వర్గాలూ పేర్కొంటున్నాయి. పార్టీ సంక్షోభంలో కూరుకుపోయిందనేది ప్రశ్న కాదని ఆదిత్య ఠాక్రే అన్నారు. 40 మంది ఎమ్మెల్యేలు, 12 ఎంపీలు ద్రోహులుగా వ్యవహరిస్తూ ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరి పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఠాక్రే మండిపడ్డారు. మరో పార్టీ పంచన చేరేవారిని ద్రోహులుగా సంభోధించడమే సరైనదని ఆదిత్యా ఠాక్రే తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఇదే సంస్కృతి చట్టబద్ధమై దేశవ్యాప్తంగా జరిగితే ప్రతి రాష్ట్రంలో రాజకీయ అశాంతి ప్రబలుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్‌లో శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ కూలిపోవడంతో బీజేపీ మద్దతులో ఏక్‌నాథ్ షిండే సారధ్యంలో నూతన ప్రభుత్వం కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్ధితి తలెత్తడంతో ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేశారు. షిండే వర్గం తిరుగుబాటుతో ఠాక్రే శిబిరంలో కేవలం 13 మంది ఎమ్మెల్యేలే మిగిలిఉన్నారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలిగిన తాము ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరుకున్నామని ఆదిత్యా ఠాక్రే ఓ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. అయితే ఓ వ్యక్తి స్వార్ధం కోసం మహారాష్ట్ర ప్రయోజనాలను వారు పణంగా పెట్టారని ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)