రాహుల్ యాత్రతో కాంగ్రెస్​ పార్టీలో ఐక్యత

Telugu Lo Computer
0


రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ లో ఐక్యతను తీసుకొచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. మంగళవారానికి యాత్ర 69వ రోజుకు చేరుకోగా మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వాషిమ్‌లో జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ను, భారత్ జోడో యాత్ర ఒక్కటిగా చేసిందని తెలిపారు. ఓట్ల కోసం రాహుల్ పాదయాత్ర చేయడం లేదని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పాదయాత్ర చేస్తోందని ఆయన వెల్లడించారు. గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు జైరాం రమేశ్ నివాళి అర్పించారు. బిర్సా ముండా భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. గిరిజనుల భూ హక్కుల కోసం ఆయన పోరాడారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అటవీ హక్కుల చట్టం, 2013 భూసేకరణ చట్టాలపై బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల భూములను బలవంతంగా లాక్కొని.. బడా కంపెనీలకు కట్టబెట్టడమే నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానమని జైరాం రమేశ్ ఆరోపించారు. ఉదయం హింగోలి జిల్లా ఫలేగావ్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. జైరాం రమేశ్, మహారాష్ట్ర మాజీ మంత్రి యశోమతి ఠాకూర్ తదితరులు ఆయన వెంట నడిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)