ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిషేధం !

Telugu Lo Computer
0


గుజరాత్‌ లోని రాజ్‌కోట్‌ జిల్లాలోని రాజ్‌ సమాధియాలా గ్రామంలోకి రాజకీయ పార్టీల నేతలు వెళ్లేందుకు ఆ ఊరి పెద్దలు అనుమతించరట !. పార్టీ నాయకులు తమ ఊరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా గ్రామ అభివృద్ధి కమిటీ నిషేధం విధించింది. ఇది ఈ నాటిది కాదు. గత నాలుగు దశాబ్దాలుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎన్నికల అభ్యర్థులు తమ గ్రామంలో ప్రచారం చేస్తే తమ ప్రాంతానికి హాని జరుగుతుందని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే రాజకీయ పార్టీలను ఎన్నికల ప్రచారానికి అనుమతించరట. దీనిపై గ్రామ సర్పంచి మాట్లాడుతూ.. ''మా గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టకుండా 1983 నుంచి నిషేధం అమల్లో ఉంది. మా విశ్వాసాల గురించి రాజకీయ పార్టీలకూ తెలుసు. అందుకే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రచారం చేపట్టదు'' అని తెలిపారు. అభ్యర్థుల ప్రచారం మాత్రమే కాదు, ఇళ్లు, వీధుల్లో రాజకీయ పార్టీల బ్యానర్లు అంటించడం, కరపత్రాలు పంచడం కూడా నిషేధమే. అయితే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఈ గ్రామం ముందుంటుంది. విలేజ్‌ డెవలప్‌మెంట్ కమిటీ రూపొందించిన నిబంధనలను గ్రామస్థులు తప్పనిసరిగా పాటించాల్సిందే. అందులో భాగంగానే ఓటు వేయకపోతే రూ.51 జరిమానా విధిస్తారు. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ గ్రామంలో దాదాపు 100 శాతం ఓటింగ్‌ నమోదవుతుందని సర్పంచి తెలిపారు. ఒకవేళ, తప్పనిసరి పరిస్థితులు ఓటు వేయకలేకపోతే వారు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 1700 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 995 మంది ఓటర్లు ఉన్నారు. ప్రచారం లేకపోవడంతో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ గ్రామంలో వైఫై, సీసీటీవీ కెమెరాల వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. కేవలం ఓటెయ్యకపోతే మాత్రమే కాదండోయ్.. చెత్త బయట విసిరేసినా ఇక్కడి ప్రజలు జరిమానాలు చెల్లించాల్సిందే..! ఇంకో విషయమేంటంటే.. ఈ గ్రామాన్ని చూసి చుట్టుపక్కల ఊర్లు కూడా ఈ మధ్య ఇలాంటి నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)