జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ

Telugu Lo Computer
0


హర్యానా జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 100 స్థానాల్లో పార్టీ గుర్తుపై పోటీచేయగా కేవలం 22 స్థానాల్లోనే గెలిచి పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆప్‌ 100కు పైగా స్థానాల్లో పోటీచేసి, 15 సీట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్డీ) 72 స్థానాల్లో బరిలో నిలువగా, 14 సీట్లలో గెలిచింది. 22 జిల్లా పరిషత్‌లకు (411 మంది సభ్యులు) ఇటీవల మూడు దశల్లో ఎన్నికలు జరుగగా.. వాటి ఫలితాలు ఆదివారం విడులయ్యాయి. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో స్వతంత్రులు 126 స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఎన్నికల్లో ఓటర్లు కొట్టిన దెబ్బను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. 15 జిల్లాల్లో 151 మంది అభ్యర్థులు బీజేపీ మద్దతుతో గెలిచారని, వారంతా తమవారేనని చెప్పుకొస్తున్నది. కొన్ని జిల్లాల్లో అధికార బీజేపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. పోటీచేసిన స్థానాల్లో కనీసం ఒక్కటి కూడా గెలవని జిల్లాలు ఉన్నాయి. పంచకుల జిల్లాలో 10 స్థానాల్లో పోటీచేయగా.. అన్నింటిలో బీజేపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నాయబ్‌ సింగ్‌ సైనీ భార్య సుమన్‌ సైనీ కూడా ఓడిపోయారు. అంబాలా జిల్లాలోని నాలుగో వార్డులో పోటీచేసి ఓటమి పాలయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)