వేమన విగ్రహ స్ధానంలో వైఎస్సార్ విగ్రహం !

Telugu Lo Computer
0


కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్శిటీలో ఉన్న యోగి వేమన విగ్రహం స్ధానంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్నితాజాగా ప్రతిష్టించారు. యూనివర్శిటీ యోగి వేమన పేరుతో ఉంటే ఆయన విగ్రహాన్ని తొలగించి వర్శిటీ అధికారులు వైఎస్ విగ్రహాన్ని చడీ చప్పుడు కాకుండా పెట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్ధులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్ధి సంఘాలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నాయి. 2006లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడపలో యోగి వేమన యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. దీంతో రాయలసీమలో విద్యార్ధులకు, ముఖ్యంగా కడప జిల్లాలో విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుందని భావించారు. ప్రజా కవి అయిన యోగి వేమన పేరుతో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన విగ్రహం కూడా అందులో పెట్టించారు. దీంతో యోగి వేమనను భవిష్యత్ తరాలు మర్చిపోకుండా ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ సర్కార్, అందునా సీఎంగా ఉన్న వైఎస్ తనయుడు వైఎస్ జగన్ తన సొంత జిల్లాలో యోగి వేమన కంటే వైఎస్సార్ యే గొప్ప అన్నట్లుగా విగ్రహం మార్చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ చర్యకు విద్యార్ధి సంఘాలు భగ్గుమన్నాయి. రాయలసీమ విద్యార్ధి సమాఖ్యతో పాటు ఇతర విద్యార్ధి సంఘాలు కూడా దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు రాజకీయ పార్టీలు కూడా దీనిపై మండిపడుతున్నాయి. కడపలోని యోగివేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి, ఆ స్థానంలో వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేయడం దుర్మార్గమని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు తప్ప రాష్ట్రంలో ఏ విగ్రహాలు ఉండకూడదా? అని ఆయన ప్రశ్నించారు. యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని ఆయన డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)