అంగరంగ వైభవంగా ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం !

Telugu Lo Computer
0


ఫిఫా వరల్డ్ కప్ ఖతార్‌లో ప్రపంచ నేతల ముంగిట, వేలాది మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో ఆదివారం రాత్రి మొదలైంది. వరల్డ్‌ క్లాస్‌ ఆర్టిస్టులతో పాటు అరబ్‌ కంట్రీ సంస్కృతి ఉట్టి పడే పెర్ఫామెన్స్‌లు, లేజర్‌ లైటింగ్, బాణాసంచా మోతతో అల్‌ బయత్‌ స్టేడియంలో ఆరంభ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఖతార్‌ వస్తున్న ఫ్యాన్స్‌ కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విమర్శల నేపథ్యంలో 'అందరికీ స్వాగతం' అనే మెసేజ్‌ ఇచ్చేలా  మొదలైంది. ప్రేక్షకుల కేరింతల నడుమ ఖతార్‌ అధినేత షేక్​ తమిమ్​ బిన్​ హమ్ద్​, ఫిఫా ప్రెసిడెంట్​ గియాని ఇన్‌ఫాంటినోతో కలిసి స్టేజ్‌పైకి వచ్చారు. అరబ్‌ థీమ్‌లో మూడు ఒంటెలతో ప్రారంభ షో ప్రారంభమైయింది. ఆ తర్వాత 'ద కాలింగ్‌' పేరిట అమెరికా యాక్టర్‌ మెర్గా ఫ్రీమన్‌ ఓ కథ చెప్పాడు. ఈ టోర్నీ ద్వారా ప్రపంచం అంతా ఒక్క చోటుకు చేరిందని అభిప్రాయపడ్డాడు. టోర్నీ అంబాసిడర్‌, ఖతార్‌కు చెందిన 20 ఏళ్ల వ్యాపారవేత్త ఘనిమ్‌ ముఫ్తాఫ్‌తో మాట్లాడాడు. అరుదైన వ్యాధి కారణంగా ఘనిమ్‌ నడుం చచ్చుబడిపోయింది. అయినా వ్యాపారంలో రాణిస్తున్న అతనితో ఫ్రీమన్‌ సాగించిన సంభాషణ స్ఫూర్తి దాయకంగా నిలిచింది. సౌత్​ కొరియాకు చెందిన పాప్​ స్టార్‌ (బీటీఎస్) జుంగ్‌ కూక్‌ పెర్ఫామెన్స్‌ ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చింది. అతను రాగానే స్టేడియం మొత్తం మార్మోగింది. ఖతారీ సింగ్‌ ఫహద్‌ అల్‌కుబైసితో కలిసి అతను వరల్డ్‌ కప్‌ అఫీషియల్‌ సాంగ్‌ 'డ్రీమర్స్‌' ఆలపించాడు. ఫిఫా ప్రెసిడెంట్‌ ఇన్‌ఫాంటినో అరబ్‌లో స్పీచ్‌ ఇవ్వగా ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆపై, అరబ్‌ సంప్రదాయ ప్రదర్శనల తర్వాత భారీ వరల్డ్‌కప్‌ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొచ్చారు. చివరగా టోర్నీ మస్కట్‌ 'లాయిబ్‌'ను ప్రదర్శించారు. సెర్మనీ ముగిసిన వెంటనే స్టేడియం పైకప్పుపై భారీ బాణాసంచా పేల్చడంతో ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది. ఓపెనింగ్‌ సెర్మనీలో ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌, యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటేరస్​, ఈజిప్ట్‌, సెనెగల్‌, పాలస్తీనా తదితర దేశాల ప్రెసిడెంట్స్‌ పాల్గొన్నారు. కాగా, వేడుకల సమయంలో స్టేడియంలో కొన్ని కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఆతిథ్య జట్టు హోదాలో ఫిఫా వరల్డ్‌ కప్‌లో తొలిసారి బరిలో నిలిచిన ఖతార్‌ ఓటమితో మెగా టోర్నీని ఆరంభించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-ఎ ఆరంభ మ్యాచ్‌లో 0-2తో ఈక్వెడర్‌ చేతిలో పరాజయం పాలైంది. ఆంటోనియో వాలెన్సియా ఫస్టాఫ్‌లోనే డబుల్‌ గోల్స్‌తో ఆకట్టుకోవడంతో ఈక్వెడార్‌ ఘన విజయంతో బోణీ చేసింది. బలమైన ఈక్వెడార్‌కు ఖతార్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈక్వెడార్‌ స్టార్టింగ్‌ నుంచే ఎదురుదాడి చేసింది. 16వ నిమిషంలో దక్కిన పెనాల్టీ స్పాట్‌ను సద్వినియోగం చేసుకొని వాలెన్సియా టోర్నీలో తొలి గోల్‌ సాధించాడు. ఆపై, 31వ నిమిషంలో సెకండ్‌ గోల్‌తో ఈక్వెడార్‌ను 2-0తో లీడ్‌లోకి తెచ్చాడు. ఆతిథ్య జట్టు ఎంత ప్రయత్నించినా గోల్‌ కొట్టలేకపోయింది.


Post a Comment

0Comments

Post a Comment (0)