బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామిర్‌పేటలో బీజేపీ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద సభ్యులు కలిగిన పార్టీ బీజేపీ అని అన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు రెండు సీట్లే గెలిచిన బీజేపీ ఇప్పుడు దేశంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని, మూడోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ కేసీఆర్ అహంకారం హింసా ప్రవృత్తిగా మారిందన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. పార్టీ మూల సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణలో అధికారంలోకి రావాడమే లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు. చెప్పుకోవడానికి ఏమీ లేక టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని.. 2023 ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ శిక్షణా తరగతుల్లో అగ్రనేతలు రానున్న రోజుల్లో పార్టీ ఎలా ముందుకెళ్లాలనేదానిపై శ్రేణులకు దిశనిర్దేశం చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)