జనగణమన, వందేమాతరానికి సమాన హోదా !

Telugu Lo Computer
0


జాతీయ గీతం 'జన గణ మన', జాతీయ గేయం 'వందేమాతరం' రెండింటికీ సమాన హోదా, గౌరవం ఉన్నాయని, ప్రతి పౌరుడు వీటి పట్ల విధిగా సమానత పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వందేమాతరం గేయానికీ కూడా జన గణ మన లాగే సమాన హోదా, సముచిత గౌరవం కల్పించాలంటూ న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖాలు చేశారు. వందేమాతరం గేయం భారత స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమ సూర్త్ఫిని రగిలించిందని, కీలక పాత్ర పోషించిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు .. దీనికి సమాధానం చెప్పాలని కేంద్ర హోం, విద్యా, సాంస్కృతిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీచేసింది. దీనిపై స్పందించిన హోం మంత్రిత్వ శాఖ.. జాతీయగీతం, జాతీయగేయం రెండూ వాటి స్వంత పవిత్రతను కలిగి ఉన్నాయని, ఈ రెండూ సమాన గౌరవానికి అర్హమైనవని కోర్టుకు తెలిపింది. ప్రతి పౌరుడు ఈ రెండింటికీ సమాన గౌరవమివ్వాలని సూచించింది. జాతీయ గేయం, జాతీయ గీతానికి సంబంధించిన నియమ నిబంధనలను, ఎప్పటికప్పుడు జారీ చేసిన న్యాయపరమైన ఉత్తర్వులను అఫిడవిట్‌లో పేర్కొంది. భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు 24 జనవరి 1950న జనగణమనను భారత జాతీయ గీతంగా ఆమోదించారని అఫిడవిట్ లో పేర్కొంది. భారత జాతీయ గీతాన్ని ప్లే చేయడానికి, పాడటానికి షరతులు , విధానాలకు సంబంధించి సూచనలు జారీ చేశారని తెలిపింది. 1971లో జాతీయ గీతాలాపనను అడ్డుకోవడం శిక్షార్హమైన నేరంగా పరిగణించి, జాతీయ గౌరవాన్ని అవమానించడాన్ని నిరోధించే చట్టం, 1971ని తీసుకొచ్చారు. జాతీయ గీతం వందేమాతరానికి సంబంధించి, ప్రభుత్వం అలాంటి శిక్షార్హమైన నిబంధనను ఏదీ చేయలేదు. అయితే జాతీయ గేయం వందే మాతరం, జాతీయ గీతం జనగణమన లను పౌరులు సమానంగా గౌరవించాలని ప్రబుత్వం స్పష్టం చేసింది. కాగా, రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ సుప్రీంకోర్టు జాతీయ గీతంపై చర్చకు నిరాకరిస్తూ తీర్పు వెలువరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)