హైదరాబాద్ వేదికగా బాలికా శక్తి సంగమం

Telugu Lo Computer
0


శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో  మూడు రోజుల పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చిన బాలికలతో శక్తి సంగమం కార్యక్రమం జరుగుతుందని విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామంలోని కాన్హా శాంతివనంలో జరిగే ఈ కార్యక్రమానికి అనేక వేల మంది బాలికలు స్వయంగా హాజరవుతున్నట్లు వెల్లడించారు. వందలాది ఎకరాల్లో విస్తరించిన శాంతివనంలో పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొనబోతోంది. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ శారదాధామంలోని విద్యాపీఠం శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలికా శక్తి సంగమం కేంద్రంగా బాలికలకు ఆచార వ్యవహారాలు, అందులోని శాస్త్రీయత, కుటుంబం విశిష్టత, ఆరోగ్యం, ఇంటి వైద్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ, లలితకళలో మెళకువలు నేర్పుతామని ఆయన తెలిపారు. 25 వ తేదీన, అంటే శుక్రవారం నాడు దేశం నలుమూలల నుంచి వచ్చిన విశిష్ట అతిథుల సమక్షంలో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. విభిన్న అంశాల మీద భారతీయం నిర్వాహకులు సత్యవాణి, విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి తదితరులు ప్రసంగిస్తారు. రెండో రోజున అంటే 26వ తేదీన వివిధ రంగాల నిపుణులతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ నర్మద, అగ్రశ్రేణి పాత్రికేయులు అమృత, బాలల హక్కుల కమిషన్ సభ్యులు అపర్ణ, తదితరులు పాల్గొంటున్నారు. అదే రోజు నగరంలోని రెండు ప్రాంతాల్లో పథ సంచలన అంటే వేలాది బాలికలతో నగర వీధుల్లో మార్చ్ ఫాస్ట్ జరుగుతుంది. చివరగా మూడో రోజు ఆదివారం నాడు సమారోప్ తో కార్యక్రమం ముగుస్తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని పేర్కొన్నారు. బాలికలలో వున్న శక్తిని వెలికితీయడానికే ఈ బాలికా శక్తి సంగమం ఏర్పాటు చేస్తున్నామని పతకమూరి శ్రీనివాస రావు వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రాంత బాలిక విద్య ప్రముఖ్ రాచపూడి లక్ష్మీ, ప్రాంత ప్రచార ప్రముఖ్ రమా విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)