ప్లేట్‌లెట్‌లకు బదులు జ్యూస్ ఎక్కించారు !

Telugu Lo Computer
0


ఉత్తర్ ప్రదేశ్లో డెంగ్యూ ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కు ప్లేట్ లెట్లకు బదులు పండ్ల రసం ఎక్కించారు. మృతుని బంధువుల ఆందోళనతో దర్యాప్తు చేపట్టిన జిల్లా యంత్రాంగం ఆరోపణలు నిజమని తేలడంతో అధికారులు హాస్పిటల్ ను సీజ్ చేశారు. ప్రయాగ్ రాజ్లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెంగ్యూతో బాధపడుతున్న 32 ఏళ్ల ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు ప్రయాగ్‌రాజ్లోని గ్లోబల్ హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్‌లో చేర్చారు. హాస్పిటల్ సిబ్బంది రోగికి ప్లాస్మా ఎక్కించగా ఆ తర్వాత రోగి పరిస్థితి మరింత విషమించింది. దీంతో మరో హాస్పిటల్ కు పంపగా.. ట్రీట్మెంట్ పొందుతూ రోగి చనిపోయారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అతను ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది ప్లాస్మాకు బదులు స్వీట్ లైమ్ జ్యూస్ ఎక్కించినట్లు ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యం సైతం పేషెంట్ కు ప్లేట్ లెట్స్ కు బదులు జ్యూస్ ఎక్కించినట్లు అంగీకరించింది. ఆసుపత్రిలో డెంగ్యూ రోగికి ప్లేట్‌లెట్‌లకు బదులుగా ఫ్రూట్ జ్యూస్ ఎక్కించిన ఘటనకు సంబంధించిన వీడియో అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హాస్పిటల్ కు సీల్ వేశారు. సమగ్ర దర్యాప్తు అనంతరం దోషులుగా తేలితే ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్లేట్‌లెట్స్‌ను రోగుల బంధువులే తీసుకువచ్చారని ఆసుపత్రి సిబ్బంది ఆరోపిస్తున్నారు. రోగి ప్లేట్‌లెట్స్ లెవెల్స్17,000కు పడిపోయిందని, దాని తర్వాత అతని బంధువులు ప్లేట్‌లెట్స్ తీసుకురావాలని చెప్పామని అన్నారు. వారు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఐదు యూనిట్ల ప్లేట్‌లెట్‌లను తీసుకువచ్చారని, అందులో మూడు యూనిట్లు ఎక్కించిన తర్వాత రియాక్షన్ స్టార్టయ్యిందని చెప్పారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)