ఢిల్లీలో ఆగని టపాసుల మోత !

Telugu Lo Computer
0


దీపావళికి టపాసులు తయారు చేసినా, నిల్వ చేసినా, కాల్చినా జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటి మోత మాత్రం ఆగలేదు. దాంతో మంగళవారం ఉదయం వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి తీవ్ర స్థాయిలో కలుషితమైంది. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన టపాసుల మోత రాత్రి మరింత ఎక్కువైంది. దాంతో మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో వాయు నాణ్యత సూచీ 323 వద్ద ఉంది. ఈ వివరాలను 'ది సిస్టమ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌ అండ్ రిసెర్చ్‌' వెల్లడించింది. గాలి నాణ్యత పలు ప్రాంతాల్లో వెరీ పూర్‌ కేటగిరీకి పడిపోయిందని పేర్కొంది. లోధి రోడ్డులో 310, ఆర్కే పురంలో 359, ఓక్లాలో 344గా వాయు నాణ్యత రికార్డయింది. గాలి కాలుష్యం తీవ్రంగానే ఉన్నప్పటికీ.. గత నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ సూచీ మెరుగ్గానే ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు వెల్లడించింది. గాలి నాణ్యత సూచీ సున్నా నుంచి 50 మధ్యలో ఉంటే 'గుడ్' అని.. 301 నుంచి 400 మధ్యలో ఉంటే.. 'వెరీ పూర్' అని అర్థం. దీపావళి వేళ.. దేశ రాజధాని నగరం కాలుష్య కాసారంగా మారుతుంది. చలికాలం సమయంలో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ముందస్తుగానే హెచ్చరికలు చేసింది. అయితే వాటితో పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీనిపై కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చదవుకున్నవారే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. చర్మంపై దురద, కళ్లల్లో మంటలతో ఇబ్బంది పడ్డామని మరికొందరు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)