ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ఘన విజయం

Telugu Lo Computer
0


పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఘన విజయం సాధించారు. ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత ఈ ఫలితాలు ఆయనకు గొప్ప ఊరటనిస్తున్నాయి. ఎనిమిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాల్లో ఆయన గెలిచారు. అధికార కూటమి అభ్యర్థులు పరాజయం పొందారు. పాకిస్థాన్ ప్రస్తుతం రాజకీయంగా, ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకుంది. ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. వర్షాకాలంలో వరద బీభత్సం ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలో ఎనిమిది నేషనల్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ గెలిచారు. ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ శివారులో ఉన్న తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, పీటీఐ బలహీనంగా ఉందని ప్రభుత్వం భావించిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహించిందని చెప్పారు. ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటర్లు అధికార కూటమికి చెందిన ఉమ్మడి అభ్యర్థులను ఓడించారని చెప్పారు. తాము అసెంబ్లీకి వెళ్లబోమని ఓటర్లకు తెలిసినప్పటికీ, తనకు ఓటు వేశారని, ఇది రిఫరెండం అని చెప్పారు. అయితే ఈ ఎనిమిది స్థానాలు గతంలో పీటీఐ అభ్యర్థులే గెలిచారు. పాకిస్థాన్‌లో ఒకే అభ్యర్థి అనేక స్థానాల్లో పోటీ చేయవచ్చు. గెలిచినవాటిలో ఏదో ఒక స్థానం నుంచి ప్రాతినిధ్యంవహిస్తూ, మిగిలిన స్థానాలకు రాజీనామా చేయవచ్చు. ఇమ్రాన్ ఖాన్ పోటీ చేసినన్ని స్థానాల్లో ఒకే వ్యక్తి పోటీ చేయడం చాలా అరుదు. ఏప్రిల్‌లో తన ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నేషనల్ అసెంబ్లీలోని తన పార్టీ సభ్యులందరి చేత ఆయన రాజీనామా చేయించారు. అయితే కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే ఉప ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం గెలిచిన ఆరు స్థానాల్లో దేనికీ ఆయన ప్రాతినిధ్యం వహించబోరని, అన్నిటికీ రాజీనామా చేసేస్తారని ఆయన పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ స్థానాలకు మళ్ళీ ఉప ఎన్నికలు తప్పవని చెప్పాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)